బీచ్ కారిడార్ …ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రాజెక్టు

బీచ్ ని చూస్తేనే చిన్న పిల్లలు నుంచి పెద్దల వరకూ అంతా తెగ ఎంజాయ్ చేస్తారు. సాగర తీరంలో కాసేపు ఉంటే చాలు ఎవరికైనా ఆనందం, ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా యాభై నుంచి…

బీచ్ ని చూస్తేనే చిన్న పిల్లలు నుంచి పెద్దల వరకూ అంతా తెగ ఎంజాయ్ చేస్తారు. సాగర తీరంలో కాసేపు ఉంటే చాలు ఎవరికైనా ఆనందం, ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా యాభై నుంచి అరవై కిలోమీటర్ల మేర అలా బీచ్ ని చూసుకుంటూ రోడ్డు మీద అలా సాగిపోతూ ఉంటే ఆ ఉత్సాహమే వేరు కదా.

అది ఎందరిదో కల. ఎన్నాళ్ళ బట్టే ఆలోచన. నిజానికి విశాఖ నుంచి భీమిలీకి పాతిక కిలోమీటర్ల  మేర రోడ్డుని ఎపుడో నిర్మించారు. ఆ రూట్లో వెళ్తూంటేనే ఎంతో మురిసి ముచ్చట పడే పరిస్థితి. ఇపుడు ఏకంగా విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు దాకా బీచ్ కారిడార్ ని పెద్ద ఎత్తున నిర్మించడానికి వైసీపీ సర్కార్ ప్రతిపాదించడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఈ బీచ్ కారిడార్ కనుక పూర్తి అయితే ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉంటుంది అనడంతో సందేహం లేదు

అదే విధంగా ఈ బీచ్ కారిడార్ ని ఆనుకుని ఎన్నో టూరిజం ప్రాజెక్టులు కూడా వస్తాయని అంటున్నారు. ఇక భోగాపురం లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుని నిర్మిస్తున్నారు. దాంతో ఏ అర్ధ రాత్రి అయినా సరే ఎవరైనా ఈజీగా విశాఖ సిటీని చేరుకునే విధంగా ఈ బీచ్ కారిడార్ ఉంటుంది అంటున్నారు.

దీన్ని విశాఖ, భీమిలీ, భోగాపురం దాకా అతి పెద్ద కారిడార్ గా చేయడమే కాకుండా జాతీయ రహదాని 16తో కలుపుతారు. దాంతో ఈ సుదీర్ఘమైన ప్రయాణం కూడా ఎవరికైనా చాలా హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ఫ్యూచర్ లో విశాఖ వాసులతో సహా ఉత్తరాంధ్రా జనాలకు భోగాపురం ఎయిర్ పోర్టు మాత్రమే ఆధారం. దానో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టేకప్ చేస్తున్న‌ ఈ భారీ ప్రాజెక్ట్ మీద అందరి ఫోకస్ ఉంది.

బీచ్ కారిడార్ కనుక పూర్తి అయితే విశాఖ మాత్రమే కాదు, ఉత్తరాంధ్రా రూపు రేఖలే మారిపోతాయనడంలో సందేహం లేదు. ఆ దిశగా ప్రతిపాదనలు  జరిగాయి. ఆలోచనలు ఆచరణలోకి వెళ్తున్నాయి. అవి పరిపూర్తి కావాలని అంతా కోరుతున్నారు.