జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయం అవసరమని పలు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా నాయకత్వం వహించేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తహతహలాడుతున్నారు. ప్రధాని కావాలనే ఆకాంక్షను మమత పరోక్షంగా బయట పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీని రాజకీయంగా వ్యతిరేకించే పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చేందుకు మమతా బెనర్జీ వేగంగా పావులు కదుపుతున్నారు.
ఈ నేపథ్యంలో మమతాబెనర్జీ, కేసీఆర్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సొరేన్, అరవింద్ కేజ్రీవాల్ తదితర ముఖ్యమంత్రులంతా వచ్చే నెలలో కీలక సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఈ సమావేశానికి అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఒప్పించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తారని సమాచారం. బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణం మమత మాటల్లో…
‘దేశ సమాఖ్య వ్యవస్థను కూలదోశారు. రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారు. వాటిని కాపాడటానికి మేమందరం కలసికట్టుగా ముందుకు రావాలి. ప్రాంతీయ పార్టీలన్నీ ఒక అవగాహనకు రావాల్సి ఉంది’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
దేశ రాజకీయాలను మార్చే కీలక ఘట్టంలో ఏపీ రాజకీయ పార్టీలు ఎటు వైపు అన్నది ప్రధాన ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు బలంగా ఉన్నాయి. వైసీపీ అధికారం చెలాయిస్తుండగా, టీడీపీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. మరి ఈ రెండు పార్టీల వైపు ఎందుకని ఎవరూ చూడడం లేదు? గత సార్వత్రిక ఎన్నికల ముందు మమతా బెనర్జీ చెప్పినట్టు దేశ వ్యాప్తంగా పర్యటించిన చంద్రబాబు… ఆ ఎన్నికల్లో ఓటమితో పూర్తిగా మౌనం పాటించారు. మమతా బెనర్జీ పలుమార్లు ఫోన్ చేసినా చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగానే అందుబాటులోకి రాలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో చంద్రబాబుపై మమత ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.
మోదీ మళ్లీ అధికారంలోకి రావడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందన్నది వాస్తవం. ఇక జగన్ సరేసరి. ఎందుకంటే సీబీఐ, ఈడీ కేసులు పెడతారేమోనని చంద్రబాబు ఊహించుకుని మోదీపై విమర్శలు మానుకున్నారు. అలాంటిది కేసులున్న జగన్ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడ్తారని అనుకోవడం అత్యాశే. జనసేనాని పవన్‌కల్యాణ్ ఇప్పటికే బీజేపీ కూటమిలో ఉన్నారు.
ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ మాత్రం ఇటు ప్రత్యామ్నాయ కూటమి, అటు బీజేపీ కూటమిలో లేకపోవడం రాజకీయ విచిత్రమే. బహుశా దేశంలో ఇలాంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి ఎదురై ఉండదు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తున్నా… ప్రశ్నించలేని దయనీయ స్థితి టీడీపీ, వైసీపీలది. టీడీపీ, వైసీపీ అధినేతలు చంద్రబాబు, జగన్ దమ్ము, ధైర్యం గురించి జాతీయ నేతలకు తెలుసు కాబట్టే …వారి వైపు కనీసం కన్నెత్తి కూడా ఎవరూ చూడడం లేదు.