నిరసనలు అనేక రకాలు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ నిరసనను, అసమ్మతిని వ్యక్తం చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పాలసీపై తెలంగాణలో రజకులు, నాయీబ్రాహ్మణులు విచిత్ర రీతిలో నిరసన ప్రకటించారు.
మోదీ సర్కార్ విద్యుత్ సంస్కరణల పేరిట తీసుకొచ్చిన విధానం వల్ల కులవృత్తులు దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని రజక, నాయీబ్రాహ్మణ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో రజక, నాయీబ్రాహ్మణ వృత్తిదారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల పుణ్యమా అని తెలంగాణలో 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం రద్దు కానుందని రజక, నాయీబ్రాహ్మణ సంఘాల నేతలు వాపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు నిరసనగా ఈ నెల 20 నుంచి ఆందోళనబాట పట్టనున్నట్టు రజక, నాయీబ్రాహ్మణ సంఘాల నేతలు హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి బీజేపీ నేతలకు క్షవరాలు చేయకూడదని తీర్మానించినట్టు నాయీబ్రాహ్మణ సంఘాల నేతలు చెప్పారు. ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.బాలకృష్ణ మాట్లాడుతూ మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త విద్యుత్ చట్టం ముసాయిదాలో సబ్సిడీల ఎత్తివేత, ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలని ఉందన్నారు.
ఇది అమల్లోకి వస్తే రజకులు, నాయీబ్రాహ్మణులకు చాలా నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ నేతలెవరికీ క్షవరాలు చేయకుండా తమ ఆగ్రహాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు.