కరోనా రెండవ వేవ్ తర్వాత సినిమారంగం ఎప్పటికి ఊపిరి పీల్చుకుంటుందో తెలియని పరిస్థితిలో ఉంది.
విడుదలైన ఏ సినిమాకీ కలెక్షన్స్ లేకపోవడం వల్ల థియేటర్లో సినిమా వెంటిలేటర్ మీదే ఉందన్న పరిస్థితి నెలకొని ఉంది పోయిన నెల వరకు.
“లవ్ స్టోరీ” మీద మాత్రం విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి కూడా ఆ సినిమాని ప్రొమోట్ చేసారు.
పాటలు హిట్ కావడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే హీరో, హీరోయిన్, దర్శకుడు కావడంతో కచ్చితంగా సినిమా హాల్స్ నిండుతాయనే ఆశించారు.
అంచనాలకు తగ్గట్టుగానే థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చారు. సినిమాకి మంచి టాకే వచ్చింది.
అంటే అంతా సర్దుకున్నట్టేనా? థియేటర్స్ లో సినిమా వ్యాపారం గాడిలో పడ్డట్టేనా?
ఇక్కడే కొన్ని భయాలు బయలుదేరుతున్నాయి.
ఇంత హైప్, టాక్ నడుమ “లవ్ స్టోరీ” మొత్తంగా వసూలు చేసిన షేర్ దాదాపు 30 కోట్లు. నిజానికి ఈ స్థాయి సినిమా రెండేళ్ల క్రితం అయితే సునాయాసంగా రూ 50- రూ 60 కోట్లు వసూలు చేసుండేదని అంచనా. ఈ లెక్క కూడా థియేటర్ ఓనర్సే చెబుతున్నారు.
ఒక హాలు యజమాని, “ప్రస్తుతం కేవలం రెగ్యులర్ ఆడియన్స్ మాత్రమే సినిమా హాలుకొచ్చి చూస్తున్నారు. వాళ్లు సినిమాకి ఎంత హిట్ టాక్ వచ్చినా తొలి మూడు రోజుల్లో చూసేస్తారు. వాళ్లైనా పనుండో, కాస్త బద్ధకించో రెండో వారాంతంలో చూడాలనుకుని వాయిదా వేసారో ఇక వారు రారు. ఎలాగూ మరో రెండువారాలైతే ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని హాలుకొచ్చి సినిమా చూసే పని పెట్టుకోరు. పైగా ప్రత్యామ్నాయ వినోదం విపరీతంగా అందుబాటులో ఉంది” అని అన్నారు.
ఈ పరిస్థితుల్లో థియేటర్ల మీద తొలి మూడు రోజుల్లో వచ్చిందే ఫైనల్ అనుకోవాలి. ఆ పైన ఎంతొచ్చినా అవి చిన్నమొత్తాలే అవుతాయి.
ఇది పెద్ద సినిమాలు నిజంగా గుబులు పుట్టించే విషయమే. కనీసం రెండో వారమైనా నిండైన వసూళ్లు ఉంటే తప్ప పెద్ద సినిమాలు ఊపిరి పీల్చుకోలేవు.
ఈ దుస్థితిని అధిగమించి పాత రోజులు రావాలంటే ఏం చెయ్యాలి? ఆ మంత్రదండం ఎవరి చేతుల్లో ఉంది..అంటే సినిమా హాళ్ల యజమానుల చేతుల్లోనే ఉంది.
అదెలాగో చూద్దాం.
నిర్మాతలు ఇటు సినిమా హాల్స్ మీద, అటు ఓటీటీ మీద కూడా కుదిరినంత ఎక్కువ రాబట్టాలని చూస్తున్నారు. వ్యాపారమంటే అదే. తప్పు లేదు. కానీ ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న డీల్స్ లో నష్టపోతున్నది థియేటర్ యజమానులే.
హాల్లో విడుదులైన రెండు వారాలకి స్ట్రీమింగ్ చేసుకునేట్టైతే ఒకలాగ, నాలుగు వారాల తర్వాతైతే ఒకలాగ ఓటీటీలు నిర్మాతలకి కండిషన్స్ పెడుతున్నాయి. కనుక తమ సినిమాకి మ్యాగ్జిమం థియెట్రికల్ రన్ ఎంతుంటుందో ఒక అంచనా వేసుకుని నిర్మాతలు ఓటీటీలతో ఒప్పందాలు చేసేసుకుంటున్నారు.
మొదటి వారాంతం బద్ధకించాక ఇక మరో రెండు మూడు వారాల్లో ఎలాగో ఓటీటీలో చూడొచ్చులే అని హాలుకి రాని ఆడియన్స్ ని రప్పించాలంటే ఏం చెయ్యాలి? మూడు నెలల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వదని చెప్పాలి. ఆ విధంగా పెద్ద సినిమాల నిర్మాతలమీద ఒత్తిడి తీసుకురాగలగాలి ఎగ్జిబిటర్లు.
చిన్న సినిమాల వాళ్లకి ఓటీటీలే శరణ్యం కనుక వాళ్లిక సినిమా హాలు బిజినెస్ వైపుకి చూడరు. మొక్కుబడిగా విడుదల చేస్తారు. రెండు వారాల్లో ఓటీటీలకెక్కేస్తారు. లేదా కుదిరితే డైరెక్ట్ ఓటీటీ రిలీజంటారు.
ఎగ్జిబిటర్స్ కి కూడా చిన్న సినిమాల వల్ల రాబడేమీ రాదు. వాళ్లకి కావాల్సింది పెద్దహీరోల సినిమాలే. పెద్ద హీరోలకి కూడా కావాల్సింది సినిమా హాళ్ళే. ఎందుకంటే వాళ్ల స్టార్డం అంతా సినిమాహాల్లోనే ఉంది.
ఓటీటీలో మహేష్ బాబు సినిమా అయినా సంపూర్నేష్ బాబు సినిమా అయినా ఒకటే. బాగుంటే చూస్తారు లేకపోతే లేదు. మొబైల్లోనూ, ఇంట్లో టీవీలోనూ ఒక్క బటన్ క్లిక్ దూరంలో మహేష్ బాబు కొత్త సినిమా చూసే వెసులుబాటుంటే ఇక అతనికి స్టార్డం ఎందుకుంటుంది? టికెట్ల కోసం లాబీయింగులు చేసుకుని అతి కష్టమ్మీద హాలుకెళ్లి 70 ఎం.ఎం తెర మీద అంత పెద్ద మహేష్ బాబుని చూస్తేనే అతను సూపర్ స్టార్ అవుతాడు.
కనుక సినిమా హాల్ ఓనర్స్ కి, హీరోలకి మధ్యన ఉన్న విషయం ఇది. ఇరువర్గాలూ ఒకళ్లమీద ఒకళ్లు బతకాల్సిన పరిస్థితి.
కనుక ఎగ్జిబిటర్స్ ఇక్కడ గట్టి కండిషన్ పెట్టాలి. సినిమా హాల్లో విడుదలైన మూడు నెలల వరకు ఓటీటీలో సినిమా స్ట్రీం అవ్వడానికి వీల్లేదు అని. దాని వల్ల ఓటీటీ మీద వచ్చే ఆదాయం నిర్మాతలకి బాగా తగ్గుతుంది. హీరోలకి మీద కూడా ఆ భారం పడుతుంది. అయినా పర్వాలేదు. స్టార్డం నిలబడాలంటే ఆ త్యాగం తప్పదు. అవ్వాకావాలి, బువ్వాకావాలి అంటే కుదరని పరిస్థితి మరి.
గణేష్ కుమార్. వి