బ్లాక్ బస్టర్ సినిమాల పరువు తీస్తున్న ఫ్యాన్స్

తమ అభిమాన హీరో నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఫ్యాన్స్ కు అంతకంటే కావాల్సిందేముంది. జీవితాంతం ఆ బ్లాక్ బస్టర్ గురించి చెప్పుకుంటారు. దశాబ్దాలు గడిచినా అది సాధించిన ఘనతల గురించి వల్లె…

తమ అభిమాన హీరో నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఫ్యాన్స్ కు అంతకంటే కావాల్సిందేముంది. జీవితాంతం ఆ బ్లాక్ బస్టర్ గురించి చెప్పుకుంటారు. దశాబ్దాలు గడిచినా అది సాధించిన ఘనతల గురించి వల్లె వేసుకుంటారు. అయితే ఏ బ్లాక్ బస్టర్స్ గురించైతే ఘనంగా చెప్పుకుంటున్నారో, అవే హిట్ సినిమాల్ని ఇప్పుడు థియేటర్లలో ఫ్లాప్ చేస్తున్నారు.

రీ-రిలీజ్ ట్రెండ్ మొదలైన వెంటనే, స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ క్యూ కట్టాయి. డబ్బెవరికి చేదు అనే టైపులో చాలామంది ఒకప్పటి సూపర్ హిట్స్ ను మళ్లీ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పోకిరి, బిజినెస్ మేన్, ఖుషి సినిమాలతో పాటు బాలకృష్ణ నటించిన మరో 2 సినిమాలు మాత్రమే మెరిశాయి.

మిగతా సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం మొదలైంది. ఎప్పుడైతే రీ-రిలీజ్ ట్రెండ్ తిరుగుముఖం పట్టిందో అప్పుడే దీన్ని ఆపేస్తే బాగుండేది. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు కాసులకు కక్కుర్తిపడి చాలామంది పాత సినిమాల్ని రిలీజ్ చేయడం మొదలుపెట్టారు.

దీంతో ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్న సినిమాలు రీ-రిలీజ్ లో అట్టర్ ఫ్లాప్ అవ్వడం మొదలయ్యాయి. ఇక్కడ ఏదో ఒక హీరో గురించి చెప్పుకోవడం అనవసరం. ప్రభాస్, చిరంజీవి, మహేష్, పవన్, ఎన్టీఆర్.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు స్టార్ హీరోలంతా తమ బ్లాక్ బస్టర్ సినిమాలతో రీ-రిలీజ్ లో డిజాస్టర్లు చూశారు.

ఒకప్పుడు ఆహాఓహో అంటూ పొగిడిన అభిమానులే రీ-రిలీజ్ లో సదరు సినిమాల వైపు చూడ్డం మానుకున్నారు. దీంతో కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్లు, రీ-రిలీజ్ లో వేలల్లో మాత్రమే వసూళ్లు తెచ్చుకున్నాయి.

ప్రభాస్ బర్త్ డే రోజు అతడి బ్లాక్ బస్టర్ మూవీని రీ-రిలీజ్ చేస్తే పట్టించుకున్న నాథుడు లేడు. యోగి, బిల్లా లాంటి సినిమాలు ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్లాయో ఫ్యాన్స్ కు కూడా తెలియదు. చిరంజీవి హిట్ సినిమాల్ని రిలీజ్ చేస్తే, మెగా ఫ్యాన్స్ పిచ్చ లైట్ తీసుకున్నారు. భైరవద్వీపం సినిమాను రీ-రిలీజ్ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు, ఆ తర్వాత ఏమైందో ఎవ్వరికీ తెలియదు.

వీళ్లు మాత్రమే కాదు, స్టార్ హీరోలందరి పరిస్థితి ఇదే. ఏవో ఒకట్రెండు సినిమాలు హిట్టయ్యాయని పోలోమంటూ అన్నింటినీ రీ-రిలీజ్ చేస్తే ఇలానే ఉంటుంది పరిస్థితి. నిజంగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే.. మెయిన్ సెంటర్లలో కొన్ని థియేటర్లలో సినిమా వేసుకొని హంగామా చేస్తే సరిపోతుంది. పేపర్ యాడ్స్ ఇచ్చి మరీ తమ హీరోల పరువును తామే తీస్తున్నారు.