ఆడలేక మద్దెల ఓడు అన్నట్లే వుంటుంది మన సినిమాలో మేధావుల వైనం. తన స్టయిల్ రెగ్యులర్ క్లాసిక్ ఫన్ లవ్ రొమాంటిక్ సినిమాను పక్కన పెట్టి, అరి వీర కమర్షియల్ సినిమా చేస్తా అని ‘వి’ అనే కళాఖండం తీసారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఓటిటికి వెళ్లి బతికిపోయింది కానీ థియేటర్ కు వచ్చి వుంటే సినిమా సత్తా తెలిసిపోయి వుండేది. జటాయువు అనే పాన్ ఇండియా అతి భారీ కథ రెడీగా వుంది. కానీ హీరోలు ఎందుకు ముందుకు రావడం లేదు?
హిందీ సినిమాను ఫ్రీమేక్ చేసి, కేసులు పడి, జబర్దస్త్ అనే మాస్ ఎంటర్ టైనర్ తీద్దాం అనుకున్నారు నందినీ రెడ్డి. అక్కడ అది కూడా ఫట్ మంది. ఆ తరువాత ఇప్పటి వరకు చిన్న, మీడియం సినిమాలే తప్ప, భారీ మాస్ సినిమాకు ఎందుకు గురి పెట్టలేదు. ఏమన్నా అంటే అది మా జానర్ కాదంటారేమో?
తన స్టయిల్, తన స్త్రెంగ్త్ మరిచిపోయి టక్ జగదీష్ అంటూ మాస్ సినిమా తీయబోయారు శివ నిర్వాణ. అది కూడా అంతే ఓటిటికి వెళ్లినా కూడా బతికి బట్ట కట్టలేదు. ఇప్పుడు ఖుషీ అంటూ మళ్లీ లవ్ స్టోరీకే వచ్చారు.
చిన్న సినిమా ఎటెంప్ట్ చేసి, ఆపై అంటే సుందరానికి అంటూ పెద్ద సినిమాకు నిచ్చెన వేసి హీరో నానికి భయంకరమైన ఫ్లాప్ ఇచ్చారు వివేక్ ఆత్రేయ.
వీళ్లంతా మంచి దర్శకులే. కాదనడం లేదు. కానీ వీళ్లకు రాని జానర్ అంటూ ఒకటి వుంది. అదే మాస్..కమర్షియల్ ఎంటర్ టైనర్. ఇలాంటి సినిమాకు లాజిక్కులు వుండవు. మ్యాజిక్ లే వుంటాయి. వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య ఇలాంటి సినిమాలే. జనానికి నచ్చాయి అంతే. అంతకన్నా మరేం లేదు. అలాంటి సినిమాలు తీయడం మాకు రాదు అని చెప్పడం తప్పేం కాదు. చిన్న తనమూ కాదు. కానీ అలాంటి సినిమాలను వెక్కిరించడం మాత్రం సరి కాదు.
బాహుబలిలో ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకు ప్రభాస్ గెంతేస్తాడు. అది అంతే. ఎలా అని అడక్కూడదు. మేం తలుచుకుంటే అలాంటి సినిమాలు ఇంకా బాగా తీయగలం అని గప్పాలు కొట్టకూడదు. తీసి చూపించాలి.
వెంకటేష్ మహా తీసింది కేరాఫ్ కంచరపాలెం. ఆ తరువాత ఓ మలయాళీ రీమేక్. మొదటి సినిమా తరువాత రెండో సినిమాకే స్వంత ఆలోచన చేయలేదు. మూడో ఆలోచన చేయడానికి నిర్మాతలను పట్టుకుని అవకాశం కోసం చూస్తున్నారు. దొరకడం లేదు. ఎందుకని? నిజంగా ఆయన దగ్గర గొప్ప కథ వుంటే హారతి ఇచ్చి మరీ కళ్లకు అద్దుకుంటారు కదా? తలచుకుంటే తీస్తాం అనడం ఎందుకు తలచుకోవచ్చు కదా?
కేజిఎఫ్ లో తల్లి కొడుక్కు బంగారం తీసుకురా అని చెప్పలేదు. ప్రపంచంలోని బంగారం అంతా నీ కోసం తెస్తా అని కొడుకు తల్లికి మాట ఇచ్చాడు. సమాజం మీద, సంపన్నుల మీద పగతో పెరిగిన కుర్రాడు ఎలా మారుతాడు? పుష్ప సినిమా హీరో క్యారెక్టర్ ఎలా వుంటుంది. తనకు లేనిది సాధించాలనే పట్టుదల. గౌరవం లేదంటే గౌరవం..కారు లేదంటే కారు..స్తోమత లేదంటే స్తోమత. ఆ క్యారెక్టర్ అలా పయనించడమే కరెక్ట్.
ప్రతి విశ్లేషణకు పలు కోణాలు వుంటాయి. కేవలం ఒక్క కోణంలో చూడడం, భళా భళీ అనడం, ఆపై వికవికలు పకపకలు అన్నీ, క్లోజ్డ్ డోర్స్ మధ్య, ఏ పార్టీలోనో బాగుంటాయి. బాహాటంగా అంటే వికటిస్తాయి. నిజానికి సినిమా జనాలకు పక్కోడి సినిమా మీద కామెంట్ చేయడం అన్నది కామన్ గా వుండే జబ్బు. అయితే అది ఇప్పటి వరకు నాలుగు గోడలలోపున లేదా ఫోన్లలో నే వుండేది. ఇప్పుడు బయటకు వచ్చి అభాసయింది.