చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీనే ‘బ్రో’ పారితోషికం

బ్రో సినిమాకు సంబంధించి వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి తెరపైకొచ్చారు. తనను ఇమిటేట్ చేస్తూ, 30 ఇయర్స్ పృధ్వీతో ఓ సన్నివేశం పెట్టినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి. ఇప్పుడు ఏకంగా…

బ్రో సినిమాకు సంబంధించి వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి తెరపైకొచ్చారు. తనను ఇమిటేట్ చేస్తూ, 30 ఇయర్స్ పృధ్వీతో ఓ సన్నివేశం పెట్టినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి. ఇప్పుడు ఏకంగా బ్రో సినిమాపైన, ఆ సినిమా వసూళ్ల పైన విమర్శలు చేశారు.

బ్రో సినిమా కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న పారితోషికం, పరోక్షంగా చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీనే అని ఆరోపిస్తున్నారు అంబటి. ఈ మొత్తం వ్యవహారానికి టీజీ విశ్వప్రసాద్ ను వాడుకున్నారనేది అంబటి వాదన.

“టీజీ విశ్వప్రసాద్ కు అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీలున్నాయి. చంద్రబాబు ఆయన ముఠా, అమెరికాలో డబ్బులు కలెక్ట్ చేసి, ఆ డబ్బులు విశ్వప్రసాద్ కు ఇస్తే, ఆయన పవన్ కల్యాణ్ కు ఇస్తున్నారు. అంటే దీనర్థం, చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీని, విశ్వప్రసాద్ ద్వారా పవన్ కల్యాణ్ కు అందించారన్నమాట. 23 కోట్లు అని పైకి చెప్పి 66 కోట్లు తీసుకున్నారా లేక 80 కోట్లు తీసుకున్నారా అనే విషయం పవన్ కల్యాణ్ చెప్పాలి. చంద్రబాబు ద్వారా వచ్చిన ప్యాకేజీని విశ్వప్రసాద్ ద్వారా అందుకున్న పవన్ కల్యాణ్, ఆ పూర్తి మొత్తాన్ని ఇన్ కం ట్యాక్స్ లో చూపించారా లేదా?”

బ్రో సినిమా డిజాస్టర్ అయిందంటున్నారు అంబటి. ఒకవేళ హిట్టయిందంటే లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రో సినిమానే తెరవెనక ఓ పెద్ద కుంభకోణాన్ని తలపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

“బ్రో సినిమా ఫ్లాప్ అయింది. సక్సెస్ అయిందంటే లెక్కలు చెప్పండి. నిజాయితీగా ఉంటానని పదేపదే చెప్పే పవన్ కల్యాణ్, బ్రో సినిమాకు ఎంత తీసుకున్నారో చెప్పాలి. రోజుకు 2 కోట్ల పారితోషికం నిజమేనా? సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చిందో చెప్పాలి. కనీసం హీరో రెమ్యూనరేషన్ డబ్బులు కూడా వెనక్కి రాలేదంటున్నారు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్. టీజీ విశ్వప్రసాద్ బ్లాక్ మనీని బ్రో సినిమా ద్వారా వైట్ మనీగా మార్చి, పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ రూపంలో ఇచ్చారు. ఇది ఓ పెద్ద కుంభకోణం.”

ఈ సందర్భంగా పవన్ పై మరిన్ని విమర్శలు చేశారు అంబటి. పవన్ వ్యక్తిగత తీరుపై ఓ కథను రెడీ చేస్తున్నానని, కొన్ని టైటిల్స్ కూడా ఆలోచిస్తున్నానని, ఓ 10 మందితో కలిసి సినిమా తీస్తానని ప్రకటించారు అంబటి. ఈ సినిమాకు నిత్య పెళ్లికొడుకు అనే పేరును పరిశీలిస్తున్నట్టు కూడా వెల్లడించారు.