2021లో ఉప్పెన బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఆ ఊపులో విజయనగరం జిల్లా రామభద్రపురం జంక్షన్ కేంద్రంగా కథ రాసుకున్నారు. ఇప్పటికీ ఈ కథ ఇండస్ట్రీలో చలామణీలోకి వచ్చేసింది కానీ సినిమా మాత్రం స్టార్ట్ కాలేదు. ముందుగా ఎన్టీఆర్ కు ఈ కథ చెప్పి ఒప్పించారు. కానీ ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ ఆలోచన మారింది.
కొరటాల శివ దేవర సినిమా వైపు మొగ్గు చూపారు. దాంతో ఈ కథ రామ్ చరణ్ దగ్గరకు వెళ్లింది. కానీ బ్యాడ్ లక్, ఆయన కూడా శంకర్ సినిమాలో ఇరుక్కుపోయారు. అది ఎప్పుడు పూర్తి అవుతుంది అన్నది భేతాళ ప్రశ్న. ఎందుకుంటే శంకర్ వెళ్లి ఇండియన్ 2 సినిమాలో ఇరుక్కున్నారు.
ప్రస్తుతం వున్న అంచనా ప్రకారం ఏప్రిల్ నాటికి ఆ సినిమా మీద రామ్ చరణ్ వర్క్ అవుతుందని అంచనాలు వున్నాయి. అందువల్ల బుచ్చిబాబు-రామ్ చరణ్ సినిమా మే నుంచి సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. అంటే ఇంకో మూడు నెలలు సమయం పడుతుందన్న మాట. ఇప్పటికే దాదాపు మూడేళ్లకు పైగా బుచ్చి ఖాళీగా వున్నారు. నిజానికి సక్సెస్ ఫుల్ డైరక్టర్ కు మూడేళ్ల సమయం అంటే మరో మూడు సినిమాలు అనుకోవాల్సిందే.
ఈ మే లో ప్రారంభం అయితే వచ్చే మే వేళకు కానీ సినిమా రెడీ కావడం కష్టం. ఉత్తరాంధ్ర నేపథ్యం, పైగా క్రీడా నేపథ్యం, ఎక్కువ అవుట్ డోర్ లేదా సెట్ లు, సిజిలతో కూడిన సబ్జెక్ట్. రామభద్రపురం జంక్షన్ లో వుండే బస్ట్ స్టాండ్, వెజిటబుల్ మార్కెట్, రద్దీ అన్నీ కనిపించేలా భారీ సెట్ వేయాల్సి వుంటుంది. అందువల్ల బుచ్చిబాబు సినిమా ఉప్పెన తరువాత మళ్లీ చూడాలంటే 2025 సమ్మర్ రావాలి. అంటే 2021 నుంచి 2025.. జస్ట్ రెండు సినిమాలు. అదీ సంగతి.