సంక్రాంతికి తెలుగు జనాలు నాలుగైదు వందల కోట్లు దులిపేస్తారు సినిమాల కోసం. తరువాత ఫిబ్రవరి ఎంటర్ అవుతుంది. ఇక్కడ బాగుంది అనే సినిమాలు సరిపోవు. అదిరిపోయింది అనే రేంజ్ సినిమాలు కావాలి. లేదంటే జనం జేబులోంచి డబ్బులు తీసే పరిస్థితి వుండదు.
పైగా ఫిబ్రవరి అంటే చదువుల సీజన్. మార్చిలో పరీక్షలకు ఇప్పటి నుంచి ఎక్కడికి కదలకుండా పేరెంట్స్ ఇంట్లో వుండిపోయే వ్యవహారం. అంతే కాదు మార్చిలో కొత్తగా స్కూలు ఫీజులు కట్టాల్సి వుంటుంది. అందువల్ల సినిమాలకు కూడా డబ్బులు తీయాలంటే అంత ఈజీ కాదు. అందుకే వాళ్లను పట్టుకుని లాగే రేంజ్ సినిమా అయితేనే ఫిబ్రవరిలో నాలుగు డబ్బులు కళ్ల చూస్తుంది. అంతేతప్ప బాగుంది అంటే సరిపోదు.
కానీ నిర్మాతల ఆలోచన వేరుగా వుంటంది. ఇంకా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ల వైపే చూస్తారు. ఫిబ్రవరిలో ఆ బ్లాక్ బస్టర్ హిట్ వుంది. ఈ సూపర్ హిట్ వుంది. అందువల్ల తమ సినిమాలు కూడా ఆడేస్తాయి అనుకుంటారు. కానీ అలా జరగదు. ఎందుకు ఆడలేదు అని బుర్ర బద్దలు కొట్టేసుకుంటారు. అప్పుడు కూడా ఆ పాత బ్లాక్ బస్టర్లనే చూస్తారు తప్ప, బాగుంది అనిపించుకుని కూడా ఆడని సినిమాల కేసి చూడరు.
పైగా ఇప్పుడు ఓటిటి కాలం. ఆ మాత్రం, ఈ మాత్రం సినిమాలను అస్సలు ఇలాంటి ఆఫ్ సీజన్ లో విడుదల చేయకూడదు. పండగ లాంటి కీలక సీజన్ లు ఈ మీడియం సినిమాలకు దొరకదు. అలా అని పండగ వెంటనే విడుదల చేస్తే జనం ఓటటిలో చూద్దాంలే అని పక్కన పెడతారు. అందువల్ల ఈ మిడ్ రేంజ్ సినిమాలను విడుదల చేయడానికి ఇప్పటి పరిస్థితుల్లో అస్సలు తొందరపడితే కష్టం అంతా వృధా కావడం తప్ప మరోటి కాదు. కనీసం సమ్మర్ లో అయినా పెద్ద సినిమాలకు కాస్త ఎడంగా వేసుకుంటే కాస్త ఫలితం వుంటుంది.
ఈ ఫిబ్రవరి కూడా వరకు అదిరిపోయే కలెక్షన్లు కళ్ల చూసిన సినిమా రాలేదు. ఓటిటి వుందిగా అనుకునే సినిమాలే ఎక్కువ వచ్చాయి. ఈగిల్ సినిమా సీనియర్ హీరో రవితేజ నటించినా కూడా మంచి ఓపెనింగ్ అందుకోలేదంటే కారణం గ్రౌండ్ లెవెల్ ఎలా వుందన్నది తెలియకుండా విడుదల చేయడమే. భైరవ కోన సినిమా ప్రీమియర్లకు మంచి స్పందనే వచ్చింది. టాక్ కూడా ఫరవాలేదు. ఇదయినా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటేనే జనాలు థియేటర్ కు వస్తారు. లేదూ అంటే ఇక ఫిబ్రవరి అయిపోయినట్లే. మార్చి నెలాఖరు నుంచి మళ్లీ సినిమాల సీజన్ మొదలవుతుంది.