మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఫుల్ ఫామ్ లో వున్నాడు. పైగా దర్శకుడు త్రివిక్రమ్ టేస్ట్ తోడయింది. దాంతో హిట్ మీద హిట్ సాంగ్ లు ఇస్తున్నాడు. సామజవరగమన… రాములో రాములు తరువాత మరో సూపర్ సాంగ్ అందించాడు. మధ్యలో ఓ మై డాడీ..అంటూ ర్యాప్ సాంగ్ అందించినా పెద్దగా క్లిక్ కాలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా విడుదల చేసిన 'బుట్ట బొమ్మా..బుట్ట బొమ్మా' పాట మళ్లీ థమన్ కు మాంచి పేరు తీసుకువచ్చేలా వుంది.
మెలోడియస్ గా స్టార్ట్ చేసి, మాస్ బీట్ జత చేస్తూ సాగిన ఈ పాట కచ్చితంగా సినిమాలో మూడో హిట్ గా నిలుస్తుందనుకోవడంలో సందేహం లేదు. రామజోగయ్య శాస్త్రి చాలా సింపుల్ సింపుల్ పదాలతో, అది కూడా రెగ్యులర్ గా కుర్రకారు వాడే క్యాచీ పదాలను వాడి పాటను రాసారు. 'మల్టీ ఫ్లెక్స్ లోని ఆడియన్స్ మాదిరిగా మౌనంగా వుండడం'…'అద్దం ముందుర నాతో నేనే యుద్దం చేయడం' 'చెంపల్లో చిటికెలు వేసి చక్రవ్తర్తిని చేయడం'…'తుంపర చాలనుకుంటే తుపానే రావడం'..వంటి పద ప్రయోగాలు త్రివిక్రమ్ ఇష్టాన్ని గుర్తు చేస్తాయి.
ఆర్మాన్ మాలిక్ పాడిన తీరు బాగుంది. పక్కా తెలుగు గాయకుడి మాదిరిగా పాడాడు. పాట మూడు నిమషాల లెంగ్త్ ఇట్టే అయిపోయింది అనిపించడం పాట బాగుంది అనడానికి నిదర్శనం. మొత్తం మీద బన్నీ 'అల వైకుంఠపురములో' అడియోలో మరో హిట్ సాంగ్ చేరింది. బయటకు వచ్చిన నాలుగు పాటల్లో మూడు హిట్ కావడం అంటే మాటలు కాదు.