కల్యాణ్ కామెడీ.. అందుకే పైరసీ చేస్తున్నారట

రూలర్ సినిమా తేలిపోయింది. సోమవారం ఈ సినిమాకు క్యాంటీన్ ఖర్చులు కూడా రాలేదు. నందమూరి అభిమానులు కూడా లైట్ తీసుకున్నారనే విషయం అర్థమౌతోంది. ఇలాంటి టైమ్ లో సిసలైన కామెడీకి తెరదీశాడు నిర్మాత సి.కల్యాణ్.…

రూలర్ సినిమా తేలిపోయింది. సోమవారం ఈ సినిమాకు క్యాంటీన్ ఖర్చులు కూడా రాలేదు. నందమూరి అభిమానులు కూడా లైట్ తీసుకున్నారనే విషయం అర్థమౌతోంది. ఇలాంటి టైమ్ లో సిసలైన కామెడీకి తెరదీశాడు నిర్మాత సి.కల్యాణ్. తమ సినిమా పైరసీకి గురైందని, అందుకే థియేటర్లకు ఎవ్వరూ రావడం లేదనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. క్వాలిటీగా సినిమా తీయడమే తాము చేసిన తప్పందంటున్నాడు.

“మేం క్వాలిటీ బాగుండాలని 4కే లో సినిమా తీశాం. ఆ క్వాలిటీనే మాకు ఇబ్బందిగా మారింది. వీడియో పైరసీ అయిపోతోంది. ఇప్పటివరకు దాదాపు 7వేల లింక్స్ డిలీట్ చేశాం. పైరసీలో ఆ  క్వాలిటీ చూస్తే బాధేస్తోంది. ఇంత క్వాలిటీగా సినిమా తీయకూడదని అనిపిస్తోంది. మీరు ఇలానే పైరసీ చూస్తే సినిమాలో క్వాలిటీ తగ్గించేస్తాం. దయచేసి పైరసీ చూడకండి, థియేటర్లకు వచ్చి సినిమా చూడండి.”

చుశారుగా.. ఓవైపు టిక్కెట్లు తెగక థియేటర్లలో ఈగలు తోలుకుంటుంటే, కల్యాణ్ ఇలా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, థియేటర్లకు వచ్చి రూలర్ సినిమా చూడమంటున్నాడో లేక హై-క్వాలిటీ ప్రింట్ అందుబాటులో ఉందని చెబుతున్నాడో కూడా అర్థంకాలేదు. ఇవన్నీ ఒకెత్తయితే సినిమా సక్సెస్ ను తను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతున్నాడు సి.కల్యాణ్.

“ఇంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు అభినందలు. మామూలుగా మనం ఫోన్ చేసి టాక్ కనుక్కోవాలి. సినిమా బాగుందంటే మనకే ఫోన్లు మీద ఫోన్లు వస్తుంటాయి. అవి రిసీవ్ చేసుకొని ఎంజాయ్ చేయాలి. అలాంటి కాల్స్ కంటిన్యూస్ గా వస్తున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫోన్ పెట్టడం లేదు.”

జైసింహాను మించిన రీతిలో రూలర్ తీశానని, త్వరలోనే రూలర్ ను తలదన్నే రీతిలో మరో సినిమా చేస్తానని చెప్పి కామెడీ పండించారు సి.కల్యాణ్.