ప్రపంచం మెచ్చిన ఓ దర్శకుడు, భుజం తట్టి రాజమౌళిని మెచ్చుకున్నాడు. అతడే జేమ్స్ కామెరూన్. అవతార్-2తో మరోసారి సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు.. ఆర్ఆర్ఆర్ ను ఆకాశానికెత్తేశాడు. అక్కడితో ఆగలేదు. రాజమౌళికి ఓ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చాడు.
హాలీవుడ్ లో సినిమా తీసే ఉద్దేశం ఉంటే కూర్చొని మాట్లాడుకుందామన్నాడు కామరూన్. దిగ్గజ దర్శకుడి నుంచి అలాంటి ఆఫర్ వచ్చేసరికి రాజమౌళి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అవతార్ దర్శకుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు సార్లు చూశానని చెప్పిన కామెరూన్, నీరు-నిప్పు కాన్సెప్ట్ ను మిక్స్ చేయడం, వాటిని రివీల్ చేసిన విధానం తనకు బాగా నచ్చిందన్నాడు. ఇద్దరు హీరోల మధ్య స్నేహం, ఆ స్నేహబంధంలోని ట్విస్టులు-టర్నులు తనను ఆకట్టుకున్నాయన్నాడు.
ఇంట్లో సినిమా చూస్తున్న తను ఒక దశలో లేచి నిలబడ్డానని, అలాంటి గూస్ బంప్ సీన్లు కొన్ని ఆర్ఆర్ఆర్ లో ఉన్నాయన్నాడు జేమ్స్. సంగీతం అందించిన కీరవాణిని కూడా ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.
రాజమౌళితో దాదాపు 4 నిమిషాల పాటు మాట్లాడాడు కామరూన్. ఈ సందర్భంగా కామరూన్ పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశాడు రాజమౌళి. వీళ్లిద్దరూ మాట్లాడుకున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.