మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ వ్యవహారశైలిపై ఆ పార్టీ అధిష్టానం అసహనంగా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చింతకాయల విజయ్ యాక్టీవ్‌గా ఉండకపోవడం ఏంటనే చర్చకు తెరలేచింది. వయసు పైబడుతున్న విజయ్ తండ్రి అయ్యన్నపాత్రుడు ఇప్పటికీ యాక్టీవ్‌గా ఉంటున్నారని, 25 ఏళ్ల యువకుడిలా దూకుడు ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
కానీ విజయ్ మాత్రం ఎవరికీ చిక్కడూదొరకడు అనే రీతిలో తయారయ్యాడని అంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడంపై సీఐడీ అధికారులు విజయ్‌పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణకు రావాలని ఆయనకు 41 ఏ నోటీసులు ఇచ్చేందుకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివపురంలోని నివాసానికి వెళ్లారు. విజయ్ లేకపోవడంతో ఆయన తల్లికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
గతంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఉదంతంలో కూడా విజయ్ 41ఏ నోటీసులు అందుకున్నారు. ఆ తర్వాత న్యాయ స్థానాన్ని ఆశ్రయించి ఉపశమనం పొందిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తన సేవల్ని ఉపయోగించుకోవడం తప్ప, తనకు చంద్రబాబు, లోకేశ్ చేసిందేమీ లేదని విజయ్ తన సన్నిహితుల వద్ద కామెంట్స్ చేస్తున్నారు. తమ పార్టీ పెద్దల వైఖరిపై అసంతృప్తిగా వున్న విజయ్… నెమ్మదిగా దూరం జరుగుతున్నారనే ప్రచారం సాగుతోంది.
కీలక సందర్భాల్లో విజయ్ పార్టీకి అందుబాటులో లేకపోవడంపై చంద్రబాబు, లోకేశ్ ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. త్వరలో లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టనున్న తరుణంలో విజయ్ పాత్ర ఏంటనేది చర్చకు తెరలేచింది. ఇదే రీతిలో విజయ్ చురుగ్గా లేకపోతే మాత్రం… పార్టీనే ఆయన్ను వద్దనుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని టాక్.