ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి. అదేంటో గానీ, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటూ రాజకీయ తెరపైకి వచ్చిన పవన్ లక్ష్యం మరిచారు. ఎరక్కపోయి రాజకీయాల్లోకి వచ్చి ఇరుక్కుపోయాననే సామెత చందాన పవన్‌కల్యాణ్ పరిస్థితి తయారైంది. రాజకీయాలంటే సినిమాల్లో డైలాగ్‌లు చెప్పినంత, అలాగే డ్యాన్స్ వేసినంత ఈజీ కాదని పవన్‌కు ఓటమి పాఠాలు నేర్పింది. 2014 ఎన్నికల సందర్భంలో జనసేనను స్థాపించిన పవన్‌కల్యాణ్, అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం, విస్తృత ప్రచారం చేయడానికి పరిమితమయ్యారు.
దీంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల యుద్ధం అంటే ఏంటో ఆయనకు అనుభవంలోకి రాలేదు. 2019 ఎన్నికలకు వచ్చే సరికి ప్రత్యక్ష పోరులో తలపడి, ప్రత్యర్థుల చేతిలో చావుదెబ్బతిన్నారు. దీంతో అతనికి రాజకీయాలు, ఎన్నికలంటే ఎలా వుంటాయో అనుభవమైంది. బహిరంగ సభల్లో ఊగుతూ, పదేపదే తల వెంట్రుకలు పైకి కిందికీ అనుకుంటూ షో చేసినంత మాత్రాన ఓట్లు రాలవని పవన్‌కు జ్ఞానోదయం అయ్యింది.
స్టేజీలపై ఉపన్యాసాలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా వుంటుందని ఓటమి నుంచి పవన్ తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల నాటికి అప్రమత్తమైతే తప్ప జనసేన బతికి బట్టకట్టలేదనే జ్ఞానోదయం ఆయనకు కలిగింది. అంత వరకూ వీరావేశంతో ఉపన్యాసాలు దంచి కొడుతూ, స్టేజీపై ఊగిపోతూ కనిపించిన పవన్‌కల్యాణ్… తాజాగా బాబ్బాబ్బాబ్బా…బూ నాకిన్ని సీట్లు ఇవ్వవా అని దేబరించే స్థితికి దిగజారారు. ఇప్పుడాయనకు సమాజం, విలువలు, ప్రత్యామ్నాయం, ప్రశ్నించే గొంతుక, చేగువేరా తదితరాలేవీ ప్రాధాన్య అంశాలు కాకుండా పోయాయి.
ఊపిరి వుంటే ఉప్పైనా అమ్ముకునే బతకొచ్చనే సామెత చందాన, తాను గెలిస్తే, తర్వాత మిగిలిన సంగతుల గురించి చూసుకోవచ్చనే పరిస్థితికి ఆయన దిగజారారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ పవన్ అన్న, జనసేన నాయకుడు నాగబాబు పొత్తులపై కామెడీ వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ పొత్తు ఆరాటంపై చర్చకు తెరలేచింది. పొత్తులు వుంటే పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు ముందుకెళ్తామని నాగబాబు అనడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పవన్‌కు అంత సీన్ లేదని, చంద్రబాబు ఆదేశిస్తే, ఆయన ఆచరిస్తారని వ్యంగ్య కామెంట్స్ చేయడం గమనార్హం. జనసేనకు ఇచ్చే సీట్లలో కూడా బాబు ఆదేశాల మేరకు జనసేన అభ్యర్థుల్ని పవన్ ప్రకటిస్తారని వెటకరిస్తున్నారు. ఇది నిజం కూడా.