చాట్ జీపీటి..ఇది ప్రస్తుతం ఎందరికో గుబులు పుట్టిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే చాట్ బాక్స్. దానికి తెలియని విద్య లేదు, రాని పని ఉండదు అన్నట్టుగా కనిపిస్తోంది.
ఒక వెబ్ పేజ్ తయారుచేయడానికి జావా స్క్రిప్ట్ లో ప్రోగ్రాం రాయమంటే 3 క్షణాల్లో రాసి ఇచ్చేస్తోంది. దానిని కాపీ పేస్ట్ చేసుకుని వాడుకోవడమే. ఇది చూసి ప్రొగ్రామింగ్, కోడింగ్ ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. లక్షలు పోసి ఇంజనీరింగ్ చదివి, అమీర్ పేటలో స్పెషల్ క్రాష్ కోర్సులు కూడా చేసి, ఏళ్ల తరబడి కష్టపడి, అనుభవాన్ని గడించి తామొక ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంటే..తాము నెలంతా చేసే పనిని ఈ చాట్ జీపీటి ఒక గంటలో చేసి పారేయగలిగితే తమ ఉద్యోగాలు ఏమౌతాయా అని దిగులు చెందుతున్నారు. అనుకున్నట్టుగానే తమ భయాలు నిజమౌతున్నాయి. కంపెనీ యజమానులు 10 మంది కోడింగ్ నిపుణులున్న చోట ఇద్దర్ని ఉంచి మిగిలిన వాళ్లని ఇళ్లకి పంపించే ఆలోచనలు చేస్తున్నారు. ఈ చాట్ జీపీటి మీద పూర్తి నమ్మకం కలిగితే ఆ ఇద్దరూ కూడా వెళ్లిపోవచ్చు.
ఒక్క కోడింగ్ విభాగమే కాదు టెక్నికల్ కాపీ రైటర్స్ కి కూడా ప్రస్తుతమున్న ఈ చాట్ జీపీటి అశనిపాతమే.
ఇదంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మాయాజాలం. ఇప్పటికే ఈ టెక్నాలజీతో కొన్ని దేశాల్లో నేరవిచారణ చేయడం, శిక్షలు విధించడం, జడ్జ్మెంట్ కాపీ తయారు చేసి ఇవ్వడం లాంటి కోర్ట్ పనులు జరిగిపోతున్నాయి.
అలాగే కొన్ని రకాల సర్జెరీలు చేయడం వంటి వైద్యకార్యాలు కూడా అయిపోతున్నాయి.
డ్రైవర్ అవసరం లెని కార్స్ గురించి వింటూనే ఉన్నాం, చూస్తున్నాం.
ఇంకా ఇలా అన్ని రంగాలకు ఏ.ఐ (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్) పాకిపోతుంది. తద్వారా అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలు పోతాయని అందరిలోనూ భయం నెలకొని ఉండడం సాధారణం.
కానీ జరిగేది అది కాదు. మరొక కొత్త ఉద్యోగ విప్లవం రాబోతోంది. సాఫ్ట్ వేర్ రంగంలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలన్నీ పోతాయి. కానీ వివిధ సంస్థలను ఏ.ఐ ఎనేబుల్ చేయడానికి లక్షలాది మంది ఉద్యోగుల అవసరముంది. ఆ ఉద్యోగాలన్నీ పుడతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు పైన చెప్పుకున్న రంగాల్లో ఏ.ఐ ప్రమేయముందంటే అదంతా కొంత మంది మనుషులు ఏళ్ల తరబడి శ్రమించి యంత్రానికి నేర్పిన విద్య వల్లే. ఇప్పుడు అలాంటి నిపుణుల అవసరం ప్రపంచం మొత్తానికి ఉంది. అమీర్ పేటలో జావా, సీ ప్లస్ ట్యుటోరియల్స్ పోయి ఏ.ఐ ట్యుటోరియల్స్ వస్తాయి. అంతే. ఉద్యోగాలు, అవకాశాలు చావవు. వాటి రూపం మార్చుకుంటాయంతే.
1990ల వరకు టైప్, షాట్ హ్యాండ్ వస్తేనే ఉద్యోగాలనేవారు. ఎన్నో ఇనిస్టిట్యూట్లు టైప్, షాట్ హ్యాండ్ నేర్పేవి. కానీ అసలా షాట్ హ్యాండ్ ని ప్రపంచం మర్చిపోయి చాలా కాలమైంది.
టైప్ నేర్చుకునేటప్పుడు చిటికినవేలు ఫలానా అక్షరం మీద పడాలని, బొటనవేలు స్పేస్ బార్ మీదే పడాలని, చూపుడు వేలు ఫలానా అక్షరాలకి మాత్రమే పరిమితమని, ఆ మూలనున్న అక్షరాన్ని కొట్టడానికి ఫలానా వేలే వాడాలని ఏవో నియమాలుండేవి. ఇప్పుడవేమీ లేకుండా కేవలం రెండు బొటన వేళ్లతో స్మార్ట్ ఫోన్లో పెద్ద పెద్ద మెసేజులు కొట్టేస్తున్నాం. అంటే మిగిలిన వేళ్లు పని లేకుండా పోయాయా? కాదు. ఆ మిగిలిన వేళ్ళే స్మార్ట్ ఫోన్ ని పడిపోకుండా పట్టుకునే పనిలో ఉన్నాయి.
ఇప్పుడూ అదే జరగబోతోంది. ఉద్యోగాలు పోయినా కొత్తపుంతలు తొక్కే ఉద్యోగాలు వస్తాయి. ఇంజెనీరింగ్ లో ఏ.ఐ స్పెషలైజేషన్ చేసేవాళ్లకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. చేయకపోయినా పర్వాలేదు. ఫలానా రంగంలో ఫలానా విభాగానికి చెందిన డేటా క్యురేషన్, డేటా లేబులింగ్, రెకమెండేషన్స్ పంపడం వంటి అంశాల్లో కోర్సులు పుట్టుకొస్తాయి. ఆ కోర్సులు పూర్తి చేసి ఆయా ఉద్యోగాలు పొందడమే. సాఫ్ట్ వేర్ స్థానే ఏ.ఐ ఉంటుందంతే.
ఆ ఉద్యోగాలు ఎక్కడో కాదు మళ్లీ ఈ గూగుల్, ఏపిల్, అమేజాన్, ఐబీయం, మెట వంటి కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీల్లోనూ, కొత్తగా పుట్టబోయే కంపెనీల్లోనూ ఉంటాయి. అంటే ఏ.ఐ విభాగమనేది తప్పనిసరైపోతుంది. నేర్పేది, నేర్చుకునేది, నేర్పబడేది అంతా ఏ.ఐ నే అవుతుంది కొన్ని దశాబ్దాల పాటు. సాఫ్ట్ వేర్ లాగానే ఇందులో ఎన్నో జెనెరేషన్స్ చూస్తాం. ప్రపంచమంతా ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఎనేబుల్ అయినట్లు ఏ.ఐ ఎనేబుల్ అవుతూ ఉంటుంది. అది నిత్యం జరుగుతూనే ఉంటుంది.
ప్రస్తుతం ఇండియాలో 67% కంపెనీలు 10% కంటే తక్కువ బడ్జెట్ ని ఏ.ఐ మీద పెడుతున్నాయి. రానున్న కాలంలో ఆ బడ్జెట్ శాతం 80% కావొచ్చు. 40% కంపెనీలు ఏ.ఐ టీం ని తయారుచేసుకునే పనిలో కొత్త ఉద్యోగాలకు తివాచీ పరుస్తున్నాయి. 60% కంపెనీలు ఏ.ఐ కి చెందిన స్టార్టప్స్ వైపు ఆశాభావంతో చూస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ ఏ.ఐ విప్లవం ఇండియాకి కనకాభిషేకం చేయడానికే అన్నట్టుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏ.ఐ టేలెంట్ ని తయారు చేసి ఎగుమతి చేసే సామర్థ్యంలో ఇండియా నంబర్ వన్ స్థానంలో ఉంది. “ఏ. ఐ టేలెంట్ సాంద్రత” విషయంలో ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్-2022 మొన్న నవంబర్ లో వెల్లడించింది. కనుక ప్రతి సందు నుంచి నేడు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి విదేశాల్లో ఉన్నట్టుగా రేపు ప్రతి ఇంటి నుంచి ఒక ఏ.ఐ నిపుణుడు ఏదో ఒక అగ్రదేశంలో భారీగా సంపాదిస్తూ ఉండొచ్చు. అదంతా భారతదేశానికి పరోక్షంగా ఆర్ధిక పరిపుష్టిని ఇచ్చేదే. విదేశాల్లో ఉన్న భారతీయులు సొంత దేశంలో పెట్టుబడులు ఎన్నో చేస్తూనే ఉంటారు. ఇక్కడే ఉన్న తమ మధ్యతరగతి తల్లిదండ్రుల జీవనస్థితిగతులను పై స్థాయికి తీసుకువెళ్తారు.
సాంకేతిక విప్లవం వల్ల ఉద్యోగాలు పోయి జనం నిరుద్యోగులౌతారనుకోవడం అవివేకం. జపాన్, సౌత్ కొరియాల్లో రోబోటిక్ టెక్నాలజీని విపరీతంగా వాడతారు. కానీ అక్కడ నిరుద్యోగ సమస్య ప్రపంచ దేశాలతో చూస్తే అత్యల్పం. టెక్నాలజీని వాడకుండా మనుగడ సాగించే దేశాల్లోనే నిరుద్యోగులెక్కువ. టెక్నాలజీ చేస్తున్న ఒక పనిని తప్పించి కొత్తగా నాలుగు పనులు సృష్టిసుంది. అందువల్లనే మానవ ప్రగతి పారిశ్రామిక విప్లవం, సాఫ్ట్ వేర్ విప్లవం దాటి ప్రతి శాతాబ్దానికి ఊహించనంత పురోగతి సాధిస్తూ నిరుద్యోగ సమస్యల్ని చెరిపేసుకుంటూ పోతోంది.
ఇక్కడ మనిషి చెయ్యాల్సిందల్లా ఒక్కటే. కొత్త విప్లవం మీదపడినప్పుడు కొత్త విద్య నేర్చుకుని ముందుకెళ్లే సంకల్పం పెట్టుకోవడమే. చిన్నదో, పెద్దదో, మరింత పెద్దదో…శక్తిని అనుసరించి ఏదో ఒక ఉద్యోగం రావడం తధ్యం. మనిషికి ఉద్యోగం కాదు. ఉద్యోగాలకే మనుషులు కావాలి. మనం చూడబోయేది అదే.
– శ్రీనివాసమూర్తి