ఏదైనా వస్తువుకు బాగా డిమాండ్ ఉండి, దానికి తగ్గట్టు సప్లయ్ లేకపోతే ఆటోమేటిగ్గా బ్లాక్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. రేటు అమాంతం పెరిగిపోతుంది. గతంలో ఉల్లి ధరలు ఎలా పెరిగాయో మనందరం చూశాం. అయితే పెట్రోల్ ను బ్లాక్ లో అమ్మడం సాధ్యమేనా? అడుగడుగునా బంకులు కనిపిస్తుంటే, బ్లాకులో ఎవరు పెట్రోల్ కొంటారు?
దీనికి సరైన సమాధానం నారాయణఖేడ్ వ్యాపారులు మాత్రమే ఇవ్వగలరు. ఎందుకంటే, వాళ్లు బ్లాకులో పెట్రోల్ అమ్ముతారు కాబట్టి. అలా అని ఆ ప్రాంతంలో పెట్రోల్ లేక కాదు. పక్కనే బంకులున్నాయి. వాటినిండా పెట్రోల్ కూడా ఉంది. కానీ చాలామంది ఈ కిరాణా షాపుల దగ్గరకు వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటారు.
ఇంతకీ ఏంటా మేటర్..?
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం పెట్రోల్ దందాకు కేంద్రబిందువైంది. అలా అని వీళ్లు బ్లాకులో ఎక్కువ రేటుకు పెట్రోల్ అమ్మరు. మార్కెట్ రేటు కంటే 5 రూపాయల తక్కువకే పెట్రోల్ అమ్ముతారు. అందుకే ఈ బ్లాక్ మార్కెట్ 3 డీజిల్ టిన్నులు-6 పెట్రోలు డబ్బాలతో కళకళలాడుతోంది.
ఇంతకీ ఇక్కడ ఈ బ్లాక్ మార్కెట్ ఎలా విస్తరించిందో తెలుసా? ఈ ప్రాంతం ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్రకు సరిహద్దులో ఉండడమే. తెలంగాణతో పోలిస్తే.. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి. సో.. నారాయణఖేడ్ లోని కొందరు వ్యాపారులు సరిహద్దులకు వెళ్లి అనధికారికంగా తక్కువ రేటుకే పెట్రోల్ తీసుకొస్తున్నారు.
అలా తీసుకొచ్చిన పెట్రోల్ ను, మార్కెట్ రేటు కంటే 5 రూపాయల తక్కువకే వాహనదారులకు అమ్ముతున్నారు. దీని వల్ల వాహనదారుడికి డబ్బు ఆదా అవుతోంది, సదరు వ్యాపారికి కూడా గిట్టుబాటుగానే ఉంటోంది. దీంతో నారాయణఖేడ్ లో ఈ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. పెట్రోల్, డీజిల్ కోసం షాపుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు.