నిర్మాత వేధింపులపై ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు నిర్మాత తన అంతు చూస్తానని బెదిరించారని ఆమె వాపోయారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నవ్వాడ శోభారాణి నివాసం ఉంటున్నారు. 2018లో మినిస్టర్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న తమ భవనాన్ని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌కు తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్ (టీఎఫ్‌సీసీ) ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చినట్టు ఆమె తెలిపారు. నెలకు నాలుగున్నర లక్షల అద్దెగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు బాధితురాలు పేర్కొన్నారు. అయితే రూ.40 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామని చెప్పి, రూ.30 లక్షలే ఇచ్చినట్టు తెలిపారు.
అంతే కాకుండా అప్పటి నుంచి అద్దె కూడా సక్రమంగా చెల్లించకుండా మానసికంగా వేధిస్తున్నట్టు ఆమె తెలిపారు. పది రోజుల క్రితం తాను అద్దె చెల్లించలేనంటూ నిర్మాత రామకృష్ణగౌడ్ తాళాలు అప్పగించి వెళ్లిపోయాడన్నారు. అయితే నిర్మాత కుమారుడు సందీప్‌ను తన ఇంటి మీదకి పంపించి దౌర్జన్యానికి దిగినట్టు ఆమె చెప్పారు.
తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించడంతో పాటు తనకు అధికార పార్టీ పెద్దల అండదండలున్నాయని, తమతో పెట్టుకుంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొన్నారు.