తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరింది. ఆయన పంతం నెగ్గింది. ప్రతిపక్షాలపై మరోసారి విజయం సాధించారు. హైకోర్టును వాదనలతో మెప్పించారు. ప్రభుత్వ వాదనలతో కోర్టు అంగీకరించింది. సరే … సచివాలయాన్ని కూల్చుకొని కొత్తది కట్టుకోండి అని హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. హైకోర్టు కూల్చివేతపై కొన్నేళ్లుగా జరుగుతున్న వాదనలకు కోర్టు తెర దించింది
సచివాలయం కూల్చివేత నిర్ణయం సరికాదంటూ హైకోర్టులో పిటిషన్లు వేసిన కాంగ్రెస్ నాయకులు, ఇతరులు ఇక సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిందే. వెళ్లకపోతే సచివాలయం కూల్చివేత వెంటనే జరుగుతుంది. కూల్చివేతను ఇంకా కొంత కాలం ఆపాలంటే మాత్రం సుప్రీం గడప తొక్కాల్సిందే. కరోనా నేపథ్యంలో సుప్రీం కోర్టు అత్యవసర కేసులనే విచారిస్తోంది. కాబట్టి అక్కడ పిటిషన్ వేసినా విచారణ వెంటనే చేపడుతుందనే నమ్మకం లేదు.
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటే పిటిషనర్లు సుప్రీం కోర్టుకు వెళతారు. సరే …వారు ఏం చేస్తారో చెప్పలేం. ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అనేక వాదనలతో ఏకీభవించని హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు తీర్పు ఇచ్చిందో కేసీఆర్ వ్యతిరేకులకు అర్థం కావడంలేదు. కేసీఆర్ సచివాలయం కూల్చివేత గురించి బయట ఏం చెప్పారో ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కోర్టులో వాదించింది.
ప్రభుత్వ వాదనలపై హైకోర్టు చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదంటూ ప్రభుత్వం చేసిన వాదనతో కోర్టు ఏకీభవించినట్లుగా ఉంది. అందుకే చివరకు సచివాలయం కూల్చడానికి అనుమతి ఇస్తూ అన్ని పిటిషన్లను కొట్టేసింది. సచివాలయ భవనాలను కూల్చవద్దంటూ దాదాపు పది పిటిషన్లు దాఖలయ్యాయి.
రాష్ట్ర విభజన జరిగి టీఆరెస్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే కేసీఆర్ కన్ను సచివాలయం మీద పడింది. సచివాలయంలో వాస్తు దోషాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూలుస్తానని ప్రకటించారు. ఆయన సచివాలయానికి పోవడం మానేశారు. ఆ తరువాత కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రగతి భవన్ నిర్మించారు. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారు. సచివాలయం ఖాళీ చేయించి మంత్రిత్వ శాఖలను వివిధ భవనాల్లో సర్దుబాటు చేశారు. కొత్త సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.
కానీ వ్యవహారం కోర్టుకు ఎక్కడంతో ఆగిపోయారు. కేసీఆర్ కు వాస్తు అంటే పిచ్చి అనే సంగతి తెలిసిందే కదా. ఈ సచివాలయం నుంచి పరిపాలన సాగిస్తే కలిసిరాదని వాస్తు పండితులు చెప్పినట్లున్నారు. అందులోనూ ప్రభుత్వంలో కేబినెట్ హోదాతో ఒక వాస్తు సలహాదారును కూడా పెట్టుకున్నారు. ఎప్పుడైతే వాస్తురీత్యా సచివాలయం బాగాలేదని అనుకున్నారో ఇక అప్పటినుంచి దాన్ని కూల్చి కొత్తది కట్టాలనే కోరిక తాటిచెట్టులా పెరిగిపోయింది.
ఈ సెక్రటేరియట్ లో ఎవ్వరూ పొడుగవలేదు అని ఓసారి కేసీఆర్ చెప్పారు. పొడుగవడం అంటే డెవెలప్ అవడమన్నమాట. భయంకరమైన ఈ సెక్రటేరియట్ ను కూల్చి తీరాల్సిందే అన్నారు. ఈ అభిప్రాయం ఆయనకు ఎందుకు కలిగిందో తెలియదు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసినవారిలో కొందరు కేంద్రంలోనూ, ఇతరత్రా ఉన్నత పదవులు నిర్వహించారు. నీలం సంజీవరెడ్డి లోక్ సభ స్పీకర్ అయ్యారు. ఆ తరువాత రాష్ట్రపతి అయ్యారు. పీవీ నరసింహా రావు కీలక మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా, ప్రధాని కూడా అయ్యారు.
బ్రహ్మానంద రెడ్డి, జలగం వెంగళరావు, అంజయ్య కేంద్ర మంత్రులయ్యారు. చెన్నారెడ్డి పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. ఎన్ఠీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రాభవం చూశాము. బూర్గుల రామకృష్ణా రావు, ఎన్ఠీఆర్, వైఎస్సార్, రోశయ్యకు ఈ సచివాలయం అచ్చిరాలేదని అన్నారు కేసీఆర్. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్రమంతా అలజడి చెలరేగిందన్నారు.
ఆ అలజడి తెలంగాణా ఉద్యమం. దానికి కారకుడు కేసిఆరే కదా. కష్టపడి తెలంగాణా తెచ్చుకొని భయంకరమైన వాస్తు దోషాలతో ఉన్న సచివాలయంలో ఉండటమెందుకు ? అని అప్పట్లో కేసీఆర్ ప్రశ్నించారు. సచివాలయం కూలగొట్టడం సమంజసమేనని అప్పట్లో ఆయన సొంత పత్రిక నమస్తే తెలంగాణలో కథనాలు రాయించారు. ఆ కథనాలనే కోర్టులో వాదనల రూపంలో వినిపించారు.
కానీ వాస్తు దోషాల గురించి కోర్టుకు చెప్పలేదు. అది కోర్టు అంగీకరించదు కదా. అందుకని సాంకేతిక కారణాలు తెలిపారు. సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు తిరగడానికి కూడా స్థలం లేదని కోర్టుకు చెప్పారు. కేసీఆర్ వాదనకు మద్దతుగా ఫైర్ డిపార్ట్ మెంట్ కూడా సర్టిఫికెట్ ఇచ్చింది. సచివాలయంలో సాంకేతికంగా ఏయే లోపాలు ఉన్నాయో ప్రభుత్వానికి తెలియచేయడానికి ఓ కమిటీని నియమించి దాని ద్వారా నివేదిక తెప్పించుకొని కోర్టుకు సమర్పించారు.
చాలా ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించకపోవడంతో చివరి అస్త్రంగా ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో హైకోర్టుకు జోక్యం చేసుకునే హక్కు లేదని, దీనిపై ఒకసారి సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని ప్రభుత్వం వాదించింది. చివరకు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మొత్తం మీద భయంకరమైన వాస్తు దోషాలు ఉన్నాయని నమ్మిన సచివాలయాన్ని కూల్చాలన్న కేసీఆర్ పంతం నెగ్గింది.