విశాల్ అవినీతి ఆరోపణలు.. రంగంలోకి సీబీఐ

ఓ ప్రముఖుడు ఆరోపణలు చేస్తే, రియాక్షన్ ఎలా ఉంటుందో ముంబయి సెన్సార్ బోర్డ్ చవిచూస్తోంది. ఈ సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన సినిమా హిందీ వెర్షన్…

ఓ ప్రముఖుడు ఆరోపణలు చేస్తే, రియాక్షన్ ఎలా ఉంటుందో ముంబయి సెన్సార్ బోర్డ్ చవిచూస్తోంది. ఈ సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ సర్టిఫికేట్ కోసం అక్షరాలా 6 లక్షల 50వేల రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వచ్చిందని విశాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియో రిలీజ్ చేయడంతో పాటు, సోషల్ మీడియాలో సాక్ష్యాలు కూడా బయటపెట్టాడు.

దీంతో ఏకంగా సీబీఐ రంగంలోకి దిగింది. విశాల్ అందించిన ఆధారంగా విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి సెన్సార్ బోర్డుతో సంబంధం లేని థర్డ్ పార్టీ వ్యక్తులు ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో పాటు.. బోర్డులో మరికొంతమంది అధికారులపై కూడా కేసు నమోదు చేసింది.

అంతేకాదు.. నిందితుల ఇళ్లల్లో సోదాలు కూడా నిర్వహించింది సీబీఐ. ఈ మేరకు కొన్ని కీలక ఆధారాలు, మరిన్ని అవినీతి కార్యకలాపాల్ని సీబీఐ గుర్తించినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన వ్యక్తుల్లో మెర్లిన్ మెనగా, జీజా రాందాస్, రాజన్ ఎం ఉన్నట్టు సీబీఐ తెలిపింది.

తన కొత్త సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ కోసం బోర్డును ఆశ్రయించాడు విశాల్. వెంటనే రంగంలోకి దిగిన థర్డ్ పార్టీ వ్యక్తులు సెన్సార్ సర్టిఫికేట్ కోసం 7 లక్షలు డిమాండ్ చేశారు. రేటు 6.54 లక్షలకు బేరం తెగింది. ఈ మొత్తాన్ని నిందితుల ఖాతాల్లోకి బదిలీ చేశాడు విశాల్. ఇది కాకుండా, కో-ఆర్డినేటింగ్ ఫీజు కింద మరో 20వేలు సమర్పించుకున్నాడు.

వీటన్నింటిపై సీబీఐ ఆరా తీసింది. బ్యాంకులో జమ అయిన వెంటనే ఆ మొత్తం విత్ డ్రా అయినట్టు గుర్తించిన సీబీఐ, ఆ మొత్తాన్ని ఎవరికి ఇచ్చారనే కోణంలో నిందితుల్ని ప్రశ్నిస్తోంది.

విశాల్ ఆరోపణలు చేసిన వెంటనే సెన్సార్ బోర్డ్ స్పందించింది. తమ అధికారులెవ్వరూ అవినీతికి పాల్పడలేదని ప్రకటించింది. ఆ తర్వాత ఈ అంశంపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఓ సీనియర్ అధికారిని విచారణ నిమిత్తం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత ఈ కేసు ఏకంగా సీబీఐకి బదిలీ అయింది.