కొన్ని రోజుల కిందట మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు, కేఎల్ నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు. అంతకంటే ముందు ఏషియన్ సినిమాస్ కు చెందిన వ్యక్తుల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు. ఇప్పుడు తాజాగా సురేష్ బాబు ఇల్లు, ఆఫీస్ పై ఐటీ రైడ్స్. పైన చెప్పుకున్న రెండు దాడులకు, తాజా ఐటీ సోదాలకు మధ్య లింక్ ఉందని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు కొంతమంది నిపుణులు.
ఈమధ్య కాలంలో ఐటీ అధికారులు ఓ చైన్ సిస్టన్ ఆధారంగా దాడులు నిర్వహిస్తున్నారు. దారిమళ్లుతున్న కోట్ల రూపాయల డబ్బు ఆచూకీ కనుగొనేందుకు, గొలుసుకట్టు మాదిరి వివిధ సంస్థలు, ఇళ్లపై దాడులు చేస్తున్నారు. దీంతో పైన చెప్పుకున్న ఐటీ సోదాల మధ్య ఇంటర్-లింక్ ఉండే అవకాశాలున్నాయంటున్నారు చాలామంది.
కేవలం సురేష్ బాబు నివాసం, రామానాయుడు స్టుడియోలో మాత్రమే కాదు.. హీరోలు వెంకటేష్, నాని ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు అవి కొనసాగే అవకాశం ఉన్నాయంటున్నారు. ఇప్పటికే నిర్వహించిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, పన్ను ఎగ్గొట్టిన వాటికి ఆధారాల్ని అధికారులు పట్టుకున్నట్టు చెబుతున్నారు.
ఈమధ్య ఐటీ అధికారులు ఈ తరహాలోనే సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అమరావతికి సంబంధించిన ఓ కుంభకోణాన్ని కూడా ఇలానే బయటపెట్టారు. మొత్తంగా 150 కోట్ల రూపాయల మొత్తం ఓ కీలక నేత చేతికి అందినట్టు స్వయంగా అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి అప్పట్లో ఐటీ అధికారులు ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో చైన్ సిస్టమ్ తరహాలో సోదాలు నిర్వహించాల్సి వచ్చింది.
తాజాగా సినీప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై జరుగుతున్న ఐటీ దాడులు కూడా ఈ తరహా చైన్ లింక్ వ్యవహారమే అని అనుమానిస్తున్నారు చాలామంది. సోదాలు పూర్తయినా ఇప్పటికిప్పుడు వివరాలు బయటకు రావు. ఒక్కొక్కటిగా తీగలన్నీ లాగి, వాటిని ఏకం చేసి చూసినప్పుడు మాత్రమే డొంక కదులుతుంది. అసలు విషయం ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.