ఓ కులానికి చెందిన నాయకుడిని, ఇంకో కులానికి చెందిన నాయకుడు విమర్శిస్తే, ఆత్మాభిమానం గుర్తుకురావడం, ఆందోళనలకు సిద్ధమవడం సహజం. అయితే ఇది అన్నివేళలా ఒకేలా ఉండాలి. రాజకీయ పార్టీల ప్రోద్బలంతో జరిగే నిరసనలు అయితే వాటిని చీప్ ట్రిక్స్ గానే పరిగణించాలి. ప్రస్తుతం టీడీపీ ప్రోద్బలంతో యాదవ కమ్యూనిటీ నేతలని చెప్పుకుంటూ కొంతమంది రాష్ట్రవ్యాప్తంగా నానా యాగీ చేస్తున్నారు.
కొడాలి నాని ప్రెస్ మీట్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని దూషించారని, వెంటనే ఆయన యాదవ జాతికి, బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే సదరు ప్రెస్ మీట్లో యనమలపై నాని చేసిన కామెంట్లు కేవలం 1 శాతం మాత్రమే. మిగతావన్నీ చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమా, పవన్ పై విసిరిన వాగ్బాణాలే. రోషం ఉన్నవాళ్లెవరైనా నాని చేసిన కామెంట్లకు సిగ్గుతో చితికిపోయి ఉండేవారు, ధైర్యముంటే మరో ప్రెస్ మీట్ పెట్టి విమర్శలను తిప్పికొట్టేవారు. కానీ పవన్ సహా అక్కడున్నవాళ్లంతా మెమ్మెమ్మె.. బెబ్బెబ్బె.. ఎవరి భుజంపైనో తుపాకీ ఉంచి కాల్చాలనుకునే అవకాశవాదులు.
అందుకే యనమలను, ఆయన సామాజిక వర్గాన్నీ తెలివిగా తెరపైకి తెచ్చారు చంద్రబాబు. బీసీ మంత్రి యనమలను అనరాని మాటలు అంటారా అంటూ నిరసన ప్రదర్శనలు చేయిస్తున్నారు. మా నాయకుడిని కించపరుస్తారా అంటూ గింజుకుంటున్నవాళ్లంతా ఓసారి గతంలోకి వెళ్లాలి. వైసీపీలో కూడా బీసీ నేతలున్నారనే విషయాన్ని గుర్తించాలి.
కృష్ణానది వరదల సమయంలో టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ ఒకరు వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. నేరుగా కులం పేరుతో దూషించారు. ఆ వ్యాఖ్యల వెనకున్న చంద్రబాబుని ఈ కులమేధావులంతా అప్పుడెందుకు ప్రశ్నించలేదు. పైపెచ్చు వెనకేసుకొచ్చారు కూడా. చీప్ పాలిటిక్స్ చేయకూడదని నిర్ణయించుకొని వైసీపీ నేతలు దాన్ని రాద్ధాంతం చేయలేదు. లేకపోతే కచ్చితంగా చంద్రబాబు క్షమాపణ చెప్పేదాకా పరిస్థితి వచ్చి ఉండేది.
అయితే అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు ఉన్నఫలంగా లేస్తున్నాయి. ఇది కూడా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా కాబట్టి, కొడాలిపై ధ్వజమెత్తుతున్నారు యనమల వర్గీయులు, కులాన్ని అడ్డం పెట్టుకుని బురద జల్లాలనుకుంటున్నారు.
ఇక్కడ కొడాలి నాని విమర్శించింది కేవలం యనమలను మాత్రమే, ఆయన కులాన్ని కాదు. ముందు చంద్రబాబుతో మంత్రి అనిల్ కు క్షమాపణ చెప్పించండి, ఆ తర్వాత కొడాలితో యనమలకు క్షమాపణ చెప్పిస్తామంటూ వైసీపీ వర్గాలు కూడా ఎదురుదాడికి దిగుతున్నాయి.