'ఆడిన మాట తప్పకూడదు'…'వాగ్దానం చేశాక కాదనకూడదు'…'ఇచ్చిన మాట రామబాణంతో సమానం'…ఇలాంటివన్నీ పాత చింతకాయ పచ్చడి సూక్తులు.
ఇచ్చిన మాట నెరవేర్చాలనే సిద్ధాంతం శ్రీరాముడి కాలంలో చెల్లిందేమోగాని ఈ కాలంలో చెల్లదు. నోటి మాటంటే చెల్లదనుకోవచ్చు. కాని చట్ట సభల్లో పకడ్బందీగా చేసిన చట్టాలను కూడా బేఖాతరు చేస్తున్నారు పాలకులు. చట్టంలో ఉంది సరే..అయితే ఏమిటట…! దాంట్లో ఉన్నదంతా అమలు చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. చట్టసభల్లో సవాలక్ష అంటాం. చేయాలని రూలుందా? అని అడుగుతున్నారు. ఇందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టమే తిరుగులేని ఉదాహరణ. అవి చేస్తామని, ఇవి చేస్తామని, అదిస్తామని, ఇదిస్తామని చట్టంలో రాశారు. తీరా అమలు చేయండని అడిగేసరికి కొన్ని ఇవ్వడం కుదరదన్నారు.
కొన్నింటి విషయంలో చేద్దాం..చూద్దాం అంటున్నారు పాలకులు. దేనికైనా టైమ్ రావాలి అనుకోవడం తప్ప చేసేందేం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రహసనం చూశాం. ఇప్పుడు ఈ చాలాకాలం తరువాత పార్లమెంటులో టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాసరావు (నాని) అసెంబ్లీ సీట్ల పెంపు గురించి ప్రస్తావించాడు.
విభజన చట్టంలో మాట ఇచ్చిన ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచుతామన్నారుగా ఏమైంది? అని అడిగాడు. దీనికి హోం శాఖ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల జాబితాలు ముద్రణ అయ్యేవరకు అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇక అప్పటివరకు తెలుగు రాష్ట్రాల పాలకులు ఎదురుచూడాల్సిందే.
దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి? చట్టం వేరు, దాంట్లోని అంశాలపై నిర్ణయాలు వేరు. పార్లమెంటులో ప్రధాని నోటి మాటగా వాగ్దానం చేసినా, చట్టం చేసినా అప్పుడు అధికారంలో ఉన్న పాలకుల రాజకీయ ప్రయోజనాలను బట్టే అంతా జరుగుతుంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర పాలకులు ఎలా నోరు మూసుకొని కూర్చున్నారో, అసెంబ్లీ సీట్లు పెంచకపోయినా చేసేదేం లేదు. రాష్ట్ర విభజన కాగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ పెరుగుతాయని ఆశించారు. చట్టం ప్రకారం తెలంగాణలో 119 స్థానాలు 150, ఏపీలో 175 సీట్లు 225 కావాలి. సీట్లు పెరుగుతాయనే ధీమాతోనే కేసీఆర్, చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎడాపెడా చేర్చుకున్నారు.
అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు సీట్లు పెరుగుతాయని, వర్రీ అవక్కర్లేదని చెప్పారు. ఇద్దరు సీఎంలూ సీట్ల పెంపు గురించి వెంకయ్య నాయుడిని ఫాలో అప్ చేశారు. ఆయన కూడా భరోసా ఇవ్వడంతో వీరు ధైర్యంగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో 2026 వరకు సీట్లు పెంచేది లేదని చెప్పింది. కాని ఇద్దరు ముఖ్యమంత్రుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో 2019 ఎన్నికల్లో పెంచాలని అనుకుంది. కాని కాలేదు.
అసెంబ్లీ సీట్లు పెరగకపోవడానికి కారణం అప్పట్లో కొత్తగా తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ లక్ష్మణ్ అని వార్తలొచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విచ్చలవిడి ఫిరాయింపులపై ఈయన పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు, ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారట.
దీంతో సీట్ల పెంపుపై కేంద్రం పునరాలోచనలో పడిందట. అంతకుముందు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సీట్లు పెంచొద్దని, పెంచితే టీఆర్ఎస్, మజ్లిస్‌కు మేలు చేసినవాళ్లమవుతామని ప్రధాని మోదీకి, అమిత్ షాకు చెప్పారట. అయితే ఈ విషయం తాము లిఖితపూర్వకంగా తెలియచేయలేదని, మౌఖికంగానే చెప్పామని లక్ష్మణ్ అన్నారు.
ఫిరాయింపులను ప్రోత్సహించిన టీఆర్ఎస్కు ప్రయోజనం కలగకూడదనేది తమ అభిప్రాయమన్నారు. అప్పట్లో ఆంధ్రా బీజేపీ నాయకులు సీట్ల పెంపు కావాలనుకున్నారు. అప్పటికి టీడీపీ, బీజేపీ విడిపోలేదు.
వచ్చే ఎన్నికల్లో (2019) తాము ఒంటరిగా పోటీ చేయబోవడంలేదని, టీడీపీతో కలిసే పోటీ చేస్తామని, కాబట్టి టీడీపీ కోరుతున్నట్లు సీట్లు పెంచాలని అన్నారు. సీట్లు పెరిగితేనే తమకు కూడా ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశముంటుందని అన్నారు. సీట్లు పెంచాలని కోరుతూ ఆంధ్రా నుంచి బీజేపీ, టీడీపీ నేతల బృందం పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసింది. సీట్లు పెంచడంవల్ల ప్రయోజనం ఉంటుందా? అని బీజేపీ నేతలను ఆయన అడిగారు. కాని ఆ తరువాత టీడీపీ, బీజేపీ మధ్య కొట్లాటలు కావడం, అది చినికిచినికి గాలివానై విడిపోవడం జరిగింది. మళ్లీ ఇప్పుడు పార్లమెంటులో టీడీపీ మరోసారి సీట్ల పెంపు విషయం ప్రస్తావించి భంగపడింది.