టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పార్ట్-2 మొదలైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై దృష్టిపెట్టిన ఈడీ, అనుమానిత సినీప్రముఖుల్ని వరుసగా విచారించేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంది.
ఇందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాధ్ ను 10 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు, ఈరోజు సినీనటి కమ్ నిర్మాత చార్మిని ప్రశ్నించబోతున్నారు. సరిగ్గా ఇక్కడే పోలీసులు కంగారు పడుతున్నారు.
సరిగ్గా నాలుగేళ్ల కిందటి సంగతి…
సిట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ వేగంగా జరుగుతోంది. వరుసగా అందరూ వస్తున్నారు, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వెళ్లిపోతున్నారు. కానీ చార్మి మాత్రం ఆ టైమ్ లో ఓ రేంజ్ లో హంగామా చేసింది.
విచారణకు హాజరయ్యే సమయంలో ఓ కానిస్టేబుల్ తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ చార్మి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఓ దశలో మీడియాలో డ్రగ్స్ కేసు విచారణ కంటే “చార్మి-కానిస్టేబుల్” వ్యవహారమే హైలెట్ అయిందంటే.. ఆమె ఎంత హంగామా చేసిందో అర్థం చేసుకోవచ్చు.
అక్కడితో ఆగలేదు ఛార్మి వ్యవహారం. తన విచారణకు సంబంధించి ఆమె హైకోర్టు కెక్కింది. ఓ మహిళగా తన హక్కుల్ని గుర్తుచేసింది.చివరికి అన్నీ కాకపోయినా, కొన్ని పరిస్థితులైనా తనకు అనుకూలంగా ఉండేలా కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకొని మరీ విచారణకు హాజరైంది.
ఇప్పుడేంటి పరిస్థితి..?
అప్పట్లో విచారణ సందర్భంగా చార్మి చేసిన హడావిడి ఈడీ అధికారులకు తెలియకపోవచ్చు. కానీ లోకల్ పోలీసులకు మాత్రం బాగా తెలుసు. అందుకే ఈరోజు ఛార్మి విచారణకు హాజరవుతోందని తెలిసిన వెంటనే పోలీసులు మరోసారి అలెర్ట్ అయ్యారు. ఈసారి చార్మికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. మీడియాను ఆవరణలోకి రాకుండా ముందుగానే నియంత్రించిన పోలీసులు.. ఈరోజు చార్మి కోసం పూర్తిస్థాయిలో మహిళా పోలీసుల్ని నియమించారు.
పూరి జగన్నాధ్ టైపులోనే చార్మిని కూడా ఈడీ అధికారులు ఈ రోజంతా విచారించే అవకాశం ఉంది. ఛార్మి బ్యాంక్ ఖాతాలపై ఇప్పటికే ఆరా తీసిన అధికారులు.. ఆ దిశగా ఆమెపై ప్రశ్నలు సంధించబోతున్నారు. పనిలోపనిగా ఛార్మి-పూరి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలపై కూడా ప్రశ్నలు కురిపించే అవకాశం ఉంది.