రానున్న కాలమంతా రాజకీయమే. సార్వత్రిక ఎన్నికలకు ఇక ఏడాదిన్నర సమయమే ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే పొత్తులపై జనసేనాని పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
పవన్‌కల్యాణ్ మూడు ఆప్షన్లు కూడా ఇచ్చారు. అయితే టీడీపీ, బీజేపీ నుంచి మాత్రం పవన్ ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం. ఇదిలా వుండగా జనసేనకు మద్దతుపై చిరంజీవి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ్ముడు పవన్‌కల్యాణ్‌లో రాజకీయంగా జోష్ నింపే కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి చేశారు. పవన్‌కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి 9 ఏళ్లైనా ఇంత వరకూ చిరంజీవి ఎప్పుడూ నేరుగా మద్దతు ప్రకటించలేదు. రాజకీయంగా పవన్‌కు ఊపు తెచ్చేలా చిరంజీవి మాట్లాడ్డం చర్చనీయాంశమైంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఇటీవల “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అంటూ ట్వీట్ చేయడంపై చిరంజీవి స్పందించారు. ఆ డైలాగ్‌లు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనన్నారు. పవన్‌కు మద్దతుపై చిరంజీవి మాటల్లోనే…
“జనసేనకు మద్దతు ఇస్తానో, లేదో భవిష్యత్తే నిర్ణయించాలి. నా తమ్ముడి నిబద్ధత, నిజాయతీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. పవన్‌కల్యాణ్ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు మనకు రావాలి. నా ఆకాంక్ష కూడా అదే. దానికి నా మద్దతు వుంటుంది. మేం చెరో వైపు వుండడం కంటే, నేను తప్పుకోవడమే తనకు హెల్ప్ అవుతుందేమో! భవిష్యత్‌లో తను ఏ పక్షాన వుంటాడనేది ప్రజలు నిర్ణయిస్తారు. పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలని నేను కోరుకుంటున్నా. రాజకీయాల నుంచి నేను వైదొలగడం వల్ల పవన్‌కల్యాణ్ మరింత బలోపేతం కావచ్చు” అని చిరంజీవి మనసులో మాట బయటపెట్టారు.
ఇంత వరకూ పవన్‌కు ఎప్పుడూ చిరంజీవి ఈ విధంగా బహిరంగంగా మద్దతు పలకలేదు. పవన్‌కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించే సీఎం జగన్‌తో చిరంజీవి సన్నిహితంగా మెలగడం జనసేనానితో పాటు ఆయన అభిమానులెవరికీ రుచించలేదు. తాజాగా చిరంజీవి కామెంట్స్‌తో జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది.
ఔను, పవన్ నా తమ్ముడంటూ అతని గురించి పాజిటివ్ కామెంట్స్ చేయడం విశేషం. రానున్న రోజుల్లో పవన్‌కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు.