తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ జుగుప్సాకర తీరుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సదరు మహిళా పోలీస్ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీని ఆదేశించడం గమనార్హం. ఈ ఘటనపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించడం చర్చనీయాంశమైంది.
ఇదిలా వుండగా అంజూయాదవ్ దుశ్శాసన పర్వాన్ని మొట్టమొదట ఏపీ మహిళా కమిషన్ మెంబర్ జీవీ లక్ష్మి సోషల్ మీడియా ద్వారా బయటపెట్టిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం శ్రీకాళహస్తిలో ఓ మహిళను అందరూ చూస్తుండగానే సీఐ అంజూయాదవ్ కాలుతో తన్నుతూ, చీర లాగి, జుట్టు పట్టుకుని వివస్త్రను చేయడంపై జీవీ లక్ష్మి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదని ఏకంగా మహిళా కమిషన్ సభ్యురాలే విమర్శిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
శ్రీకాళహస్తి అంజూయాదవ్‌పై మహిళా కమిషన్ మెంబర్ ఓ ప్రతిపక్ష పార్టీ నాయకురాలిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంజూ యాదవ్ తీరు జుగుప్సాకరంగా ఉందని, బాధితురాలి చీర లాగేసి వివస్త్రను చేసి జీపులో తోసి సీఎం దారుణంగా ప్రవర్తించిందని మహిళా కమిషన్ మెంబర్ మండిపడ్డారు. ఇలాంటి మహిళా సీఐ డిపార్ట్మెంట్లో ఉంటే పోలీస్ వ్యవస్థపై నమ్మకం కోల్పోవాల్సి వస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజూయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీని కోరినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
ఇదే విషయమై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనిత ఫిర్యా దుపై జాతీయ మహిళా కమిషన్ వెంటనే స్పందించి కేసు పెట్టాలని డీజీపీని ఆదేశించింది. అలాగే నిర్ణీత కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించింది. బాధిత మహిళకు వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం గమనార్హం. కానీ ఏపీ మహిళా హోంమంత్రి తానేటి వనిత, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇంత వరకూ స్పందించకపోవడం విమర్శలకు దారి తీసింది.