వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పాదయాత్రలో భాగంగా ప్రత్యర్థులపై షర్మిల ఒక్కోసారి వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. మెదక్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నోరు పారేసుకుని, అటువైపు నుంచి అదేస్థాయిలో షర్మిల మాటలు పడాల్సి వచ్చింది. తాజాగా ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను అవమానించేలా షర్మిల మాట్లాడారంటూ జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. తనపై అట్రాసిటీ కేసు నమోదు కావడంపై షర్మిల స్పందించారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అవినీతిపై ప్రశ్నించానన్నారు. ఇది తప్పా? అని ఆమె నిలదీశారు. అవినీతిపై ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పట్టించుకోలేదని ఇంతకాలం షర్మిల లోలోపల ఆవేదన చెందేవారు.
మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు, ఆయన కూడా అదే రేంజ్లో ఎదురు దాడికి దిగారు. మంత్రి నిరంజన్, షర్మిల మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఆ తర్వాత తమను అవమానించేలా షర్మిల విమర్శలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని ఆమె సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగ్గారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలతో ఆయన కూడా స్పందించారు. ఇంతకాలం రాజకీయంగా తన ఉనికినే గుర్తించడానికి నిరాకరించిన తెలంగాణ నాయకులు … ఇప్పుడిప్పుడే స్పందిస్తుండడం షర్మిలకు ఆనందం కలిగించే అంశం.