బేబి సినిమా చూసినోళ్లందరికీ ఆ మూవీ క్లయిమాక్స్ గురించి తెలిసే ఉంటుంది. దానిపై ఒకింత చర్చ కూడా జరిగింది. క్లయిమాక్స్ అలా కాకుండా మరో విధంగా ఉంటే బాగుండేదంటూ సోషల్ మీడియాలో చాలామంది తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. హీరో చిరంజీవికి కూడా అదే అనిపించింది.
బేబి సినిమా క్లయిమాక్స్ పై చిరంజీవి కూడా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, దర్శకుడ్ని పిలిచి క్లయిమాక్స్ ఎలా ఉంటే బాగుండేదో కూడా సూచించారు. అయితే తను తప్పు సలహా ఇచ్చానని, ఆ తర్వాత ఒప్పుకున్నారు.
“బేబి సినిమా క్లయిమాక్స్ లో నాకు ఓ చిన్న తప్పు కనిపించింది. చివర్లో హీరోయిన్, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు దర్శకుడు చూపించాడు. భర్తతో ఉన్నప్పుడు తను బాగానే ఉంది, ఆనంద్ ను చూసినప్పుడు మాత్రం బాధపడుతుంది. దీని వల్ల ఏమైందంటే, ఎన్ని తప్పులు చేసినా సరే, ఎవడో ఒకడు దొరుకుతాడు, వాడితో సెటిల్ అయిపోవచ్చనే భావన ప్రేక్షకులకు కలుగుతుందేమో అనిపించింది. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా.. హీరోయిన్ ను నన్ గా లేదా నర్స్ గా చూపిస్తే బాగుండేదని ఉచిత సలహా ఇచ్చాను.”
అయితే దర్శకుడే కరెక్ట్ అన్నారు చిరంజీవి. తెలిసో తెలియక తప్పు చేసినంత మాత్రాన, జీవితం అంతం అయిపోయినట్టు కాదని, ఆశావాదంతో ఉంటే జీవితం మళ్లీ చిగురిస్తుందనే సందేశాన్ని బేబి సినిమా క్లయిమాక్స్ తో ఇచ్చారని అన్నారు చిరంజీవి.