“పెద్ద పెద్ద విషయాల్లో మీరు చొరవ తీసుకోవాలి. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, పేదవాళ్ల కడుపు నింపే పథకాలు, ఉద్యోగావకాశాలు.. ఇలాంటి వాటిపై చొరవ చూపి, పురోగతి సాధిస్తే ప్రతి ఒక్కరం తలవంచి నమస్కరిస్తాం. అంతేకానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగ మా ఇండస్ట్రీ మీద ఏడిస్తే ఏమొస్తుంది.”
చిరంజీవి తాజా స్టేట్ మెంట్స్ ఇవి. ఈమధ్య కాలంలో పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ పై, బ్రో సినిమాలో తనను అనుకరించిన విధానంపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన తాజా స్టేట్ మెంట్స్ తో చిరంజీవి, ఈ అంశంపై పరోక్షంగా స్పందించినట్టయింది.
రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి, ఆ తర్వాత పాలిటిక్స్ టచ్ చేయడం మానేశారు. రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టారు. లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి నోటి నుంచి రాజకీయాలకు సంబంధించి కామెంట్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా బ్రో సినిమా వివాదం నేపథ్యంలో, పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన మాట్లాడినట్టు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడితే ఏమొస్తుందని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ప్రత్యేక హోదా గురించి, ప్రాజెక్టులు లేదా ఉద్యోగ-ఉపాధి అంశాల గురించి మాట్లాడితే బాగుంటుందని, టాలీవుడ్ సినిమాలపై, వ్యక్తులపై విమర్శలు చేస్తే ఉపయోగం ఏంటని అన్నారు చిరంజీవి. పేదవారి కడుపు నింపే దిశగా రాజకీయ నాయకులు ఆలోచన చేయాలని, అలా చేసినప్పుడు అంతా తలవంచి నమస్కరిస్తారని అన్నారు.
తన వ్యాఖ్యల్లో ఎక్కడా బ్రో సినిమా గురించి, రెమ్యూనరేషన్ల గురించి, అంబటి రాంబాబును అనుకరించడం గురించి పవన్ నేరుగా ప్రస్తావించలేదు. అయితే బ్రో వివాదం నడుస్తున్న వేళ, చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పవన్ కు మద్దతుగా ఉన్నట్టు తోస్తున్నాయి.
ఏదేమైనా లాంగ్ గ్యాప్ తర్వాత, ఏపీలో ఎలక్షన్ ఫీవర్ ఊపందుకున్న వేళ, పాలిటిక్స్ పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.