కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌కు టీడీపీ మద్దతు ఇస్తోందనే సమాచారం తెలియకూడదని రామోజీరావు భావిస్తున్నట్టున్నారు. విభజిత ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీపై తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని, ఆ ప్రభావం తాను ఆరాధించే టీడీపీపై పడకూడదని మీడియా దిగ్గజం పరితపిస్తున్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుపై విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం, ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లిన సంగతి తెలిసిందే.
రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్‌కు విపక్షాలు పట్టు పట్టాయి. దీంతో ఓటింగ్ జరపాల్సి వచ్చింది. రాజ్యసభలో మొత్తం 238 మంది సభ్యులున్నారు. వీరిలో 131 మంది అనుకూలంగా, 102 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మిగిలిన వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
ఈ బిల్లుకు తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకంగా, అలాగే ఏపీ విషయానికి వస్తే అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా ఓటు వేశాయి. కానీ ఎన్డీఏకు టీడీపీ మద్దతు ఇవ్వడాన్ని రామోజీరావు నేతృత్వంలో ఈనాడు పత్రిక దాచి పెట్టడం విమర్శలకు దారి తీస్తోంది.
మరో ఎల్లో పత్రిక మాత్రం వాస్తవాన్ని రాసింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాలు తమ మంత్రాంగంతో బీజేడీ, వైసీపీ, తెలుగుదేశం పార్టీల మద్దతును కూడగట్టారని గొప్పగా రాయడాన్ని చూడొచ్చు. ఈ మూడు పార్టీలు బిల్లుకు మద్దతుగా ఓటు వేయడంతోనే రాజ్యసభలో కేంద్రం నెగ్గిందని సదరు ఎల్లో పత్రిక రాసింది. ఎన్డీఏకు టీడీపీ మద్దతు ఇచ్చిందనే వాస్తవాన్ని ఈనాడు పత్రిక దాచాలనుకోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయనే చర్చకు తెరలేచింది.
ఏపీలో బీజేపీపై వ్యతిరేకతను వైసీపీపై మళ్లించేందుకే ఈనాడు ప్రత్యేకంగా తాను వ్యతిరేకించే అధికార పార్టీ పేరు రాసినట్టు చెబుతున్నారు. అయితే అత్యున్నత చట్టసభలో ఏఏ పార్టీల మద్దతు ఎవరెవరికనే విషయాలు తెలియవని ఈనాడు పత్రిక అనుకుని, తాను రాసిందే నిజమని నమ్మి, వ్యతిరేకత పెంచుకుంటారనే భ్రమలో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా చంద్రబాబు మెప్పు పొందాలని రామోజీరావు ఆశిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది.
సమాచార హక్కు చట్టంపై పెద్ద ఎత్తున చైతన్య ఉద్యమం చేసిన ఈనాడు మీడియా సంస్థ, తన రాజకీయ ప్రయోజనాలకు వచ్చే సరికి, ఏదైనా దాచడానికి వెనుకాడడం లేదు. లోకానికి తెలిసిన సంగతుల్నే దాస్తుంటే, ఇక టీడీపీ అంతర్గత విషయాలను పొరపాటున కూడా రామోజీరావు బయట పెట్టరని పలువురు అంటున్నారు.