తన పెద్దరికంపై చిరంజీవి మరోసారి క్లారిటీ ఇచ్చారు. పెద్దరికం తీసుకొని, టికెట్ రేట్లపై చర్చించడానికి వచ్చారా అంటూ మీడియా ప్రశ్నించగా.. తను సినీ పెద్దగా కాకుండా.. సినీ కళామతల్లి బిడ్డగా వచ్చానని చెప్పుకొచ్చారు. ఇదే డైలాగ్ గతంలో కూడా వినిపించారు చిరంజీవి. ఇప్పుడు మరోసారి అదే మాటను రిపీట్ చేశారు. టాలీవుడ్ పెద్ద మనిషి అనే ట్యాగ్ లైన్ ను వదిలించుకోవడానికి ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
చిరంజీవి తన పెద్దరికానికి ఏం పేరు పెట్టుకున్నప్పటికీ, ఆయన ఇండస్ట్రీ తరఫున పెద్దమనిషి హోదాలోనే జగన్ ను కలిశారు. ఎగ్జిబిటర్లు పడుతున్న ఇబ్బందిని ముఖ్యమంత్రి జగన్ కు వివరించారు. కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొన్న నష్టాల్ని, సినీ కార్మికులు పడిన కష్టాల్ని జగన్ కు కళ్లకుకట్టినట్టు వివరించారు చిరంజీవి.
సినిమా టికెట్ రేట్ల విషయంలో పునరాలోచిస్తామని ముఖ్యమంత్రి జగన్, తనకు విస్పష్టంగా హామీ ఇచ్చినట్టు చిరంజీవి చెప్పుకొచ్చారు. రోజుకు 5 షోలు ఉండాలా వద్దా అనే అంశంపై కూడా ఆలోచన చేస్తామని జగన్ నుంచి మాట వచ్చినట్టు చెప్పారు. అంతేకాదు.. త్వరలోనే సవరించిన టికెట్ రేట్లతో జీవో వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు చిరంజీవి.
సినీ పరిశ్రమలోని వ్యక్తులు లేనిపోని కామెంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేసిన చిరంజీవి.. రానున్న 2-3 వారాల్లో ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేలా ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ప్రస్తుతం జరుగుతున్న కమిటీ సమావేశానికి కూడా ప్రభుత్వం ఆహ్వానం మేరకు హాజరవుతానని చిరంజీవి తెలిపారు.
మొత్తమ్మీద సినీ బిడ్డను అంటూనే.. పెద్దరికం తీసుకున్నారు చిరంజీవి. పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు ఓ కళామతల్లి బిడ్డగా ఎప్పుడూ భుజం కాస్తానని చెప్పిన చిరంజీవి, చెప్పినట్టుగానే సినీ పరిశ్రమ సమస్యల్ని, ఆకాంక్షల్ని, డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.