‘కమ్మ’ని డిమాండ్.. ఊ అంటావా బాబూ!

చంద్రబాబును కుప్పం వదిలేయమంటున్నారు విజయవాడ, అమరావతి ప్రాంతానికి చెందిన కమ్మోళ్లు. ఈసారి తమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అమరావతి రాజధానికి చంద్రబాబు మరింత…

చంద్రబాబును కుప్పం వదిలేయమంటున్నారు విజయవాడ, అమరావతి ప్రాంతానికి చెందిన కమ్మోళ్లు. ఈసారి తమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అమరావతి రాజధానికి చంద్రబాబు మరింత గట్టిగా కృషిచేసినట్టు అవుతుందని చెబుతున్నారు. మరి బాబు ఊ అంటాడా… ఊఊ అంటాడా!

ఈ డిమాండ్ లో ఇన్-డైరక్ట్ మీనింగ్ ఏంటంటే.. మంగళగిరి నుంచి తమకు లోకేష్ వద్దని, కమ్మోళ్లు చంద్రబాబుకు పరోక్షంగా చెబుతున్నట్టయింది. బాబు కనుక ఊ అంటే కుప్పం ప్రజల్ని అవమానించినట్టే. ఊఊ అంటే మాత్రం కమ్మోళ్ల మాటను కాదన్నట్టే. బాబు ఆల్రెడీ తను కుప్పం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ అమరావతి కమ్మోళ్లు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. బాబు తమ నియోజకవర్గానికి రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. అప్పుడే రాజధాని ఉద్యమానికి ఊపు అంటున్నారు.

అంత దమ్ముందా చంద్రబాబూ..!

బాబు దమ్మున్నోడు అనిపించుకోవాలంటే మాత్రం కుప్పంను వదిలేసి అమరావతికి రావాల్సిందే. నాయకుడనేవాడు ఎక్కడ పోటీ చేసినా ప్రజామోదం ఉండాలి. అయితే కుప్పంలో పాతుకుపోయిన  బాబు, అక్కడ్నుంచి కదిలేందుకు ఇష్టపడటం లేదు. తన ఊరు అమరావతి అని చెప్పుకోవడం కాదు, మాటకు కట్టుబడి ఉంటే.. అక్కడినుంచే పోటీ చేయాలి, గెలిచి చూపించాలి, ఆ తర్వాత మూడు రాజధానులు వద్దని చెప్పాలి. కానీ బాబు ఆ సాహసానికి సిద్ధంగా లేరు.

ప్రతిపక్ష పార్టీలో ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ మాత్రమే వచ్చే ఎన్నికల్లో తాము ఎక్కడినుంచి పోటీ చేస్తామనే విషయాన్ని ముందుగా చెప్పారు. అంటే వారిద్దరిలో ఓటమి భయం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పటినుంచే లోకేష్ మంగళగిరిలో, బాబు కుప్పంలో ప్రదక్షిణలు చేస్తున్నారు. ఓట్ల కోసం పరితపిస్తున్నారు.

బాబుని అమరావతి ఆహ్వానించడం, రాజధాని ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం మంగళగిరి నుంచి పోటీ చేయాలని కోరడం ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఆయన సామాజిక వర్గం నేతల కోరికే అయినా.. వైరిపక్షాలు వ్యూహాత్మకంగా ఈ డిమాండ్ ని పెంచి పెద్దది చేసేలా ఉన్నాయి. 

బాబు సత్తా ఎంతో తేలాలంటే ఆయన అమరావతికి రావాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ సవాల్ ని బాబు స్వీకరిస్తారా..? మూడు రాజధానుల వ్యవహారానికి ఒకేసారి ఫుల్ స్టాప్ పెడతారా అనేది తేలాల్సి ఉంది.