ఓ జర్నలిస్టు ప్రకటన కర్నాటక సినీ నటుల్లో గుబులు పుట్టిస్తోంది. ఎక్కడ తమ బండారం బయట పడుతుందోననే ఆందోళన నెలకొంది. తీగ కదిపితే డొంకంతా కదిలిన చందంగా…. డ్రగ్స్ డీలర్లు అనికా, అనూప్, రాజేశ్‌లను అరెస్ట్ చేయడంతో సంచలన విషయాలు వెల్లడైనట్టు సమాచారం. గత కొన్నేళ్ల నుంచి పలువురు నటీ–నటులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వాళ్లు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా తనకు రక్షణ కల్పిస్తే సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల డ్రగ్స్ బాగోతం బయట పెడతానని, వాళ్ల పేర్లతో సహా వెల్లడిస్తానని జర్నలిస్టు ఇంద్రజిత్ లంకేశ్ ప్రకటించడం కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. డ్రగ్స్ డీలర్లు ఇచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ దందాకు సంబంధించి మత్తు పదార్థాల నియంత్రణ దళం (ఎన్సీబీ) అధికారులు నటులు, సంగీత దర్శకులకు నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. డ్రగ్స్ కేసులో విచారణ తప్పదని బెంగళూరు కమిషనర్ కమల్ పంథ్ తెలిపారు.
పోలీసుల విచారణలో డ్రగ్స్ డీలర్లు తమ దగ్గర ఎవరెవరు మత్తు పదార్థాలను కొనుగోలు చేసేవాళ్లో పేర్లతో సహా వెల్లడించారనే సమాచారం కన్నడ చిత్రపరిశ్రమకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రధానంగా టీవీ రియాల్టీ షో కళాకారులు, యాంకర్లు, డ్యాన్సర్లు డ్రగ్స్ వాడేవారని, నటీమణులు ఎక్కువగా మత్తు పదార్థాలను కొనేవారని చెప్పినట్లు తెలుస్తోంది.
సినిమా విడుదలైన వెంటనే నటీనటులు, యూనిట్ సిబ్బంది బెంగళూరులో ప్రముఖ హోటల్స్, పబ్‌లకు వెళ్లి పార్టీలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. లాక్డౌన్ సమయంలోనూ డ్రగ్స్ సరఫరా యథేచ్ఛగా సాగినట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. కోరిన చోటికి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు డీలర్లు చెప్పినట్టు తెలిసింది.
ఇంద్రజిత్ లంకేశ్‌కు పిలుపు
కాగా జర్నలిస్టు ఇంద్రజిత్ లంకేశ్ పిలుపు మేరకు సహకరించేందుకు సిద్ధమని పోలీస్ కమిషనర్ కమల్ తెలిపారు. ఇంద్రజిత్ ప్రకటనపై దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు. విచారణకు రావాలని లంకేశ్‌కు శనివారం నోటీసులు పంపినట్లు ఆయన చెప్పారు. విచారణలో భాగంగా మరెన్ని సంచలనాలు బయట పడతాయోననే ఆందోళన కన్నడ చిత్ర పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.