మొత్తానికి జనసేన మూడు రాజధానులపైన తన రాజకీయ విధానాన్ని కోర్టుకు తెలియచేయనుందిట. అమరావతి రైతులకు న్యాయం చేయలని, అక్కడ ఇప్పటికే నిర్మాణాలు జరిగినందువల్ల ఈ సమయంలో రాజధాని తరలింపు అన్నది భావ్యం కాదని కోర్టుకు తన కౌంటర్ అఫిడవిట్ లో చెప్పబోతోందిట.
అంటే విశాఖను పాలనారాజధానిగా చేయాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వ విధానానికి ఇది పూర్తి వ్యతిరేకంగా ఉండబోతోందన్నమాట. అదే సమయంలో కర్నూల్లో హై కోర్టు ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా దాన్ని ప్రకటించనున్న ప్రభుత్వ విధానాన్ని కూడా విభేదిస్తున్నట్లుగానే తెలుస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే అమరావతి రైతులకు న్యాయం చేయలని, నిర్మాణాలు దుర్వినియోగం అవుతాయంటున్న జనసేన విశాఖ సహా ఉత్తరాంధ్రా వెనకబాటుతనం మీద మాత్రం మాట్లాడడంలేదన్న విమర్శలు వస్తున్నాయి.
అమరావతిలో శాసనరాజధాని ఉంటుందని వైసీపీ ప్రభుత్వం ఈసరికే ప్రకటించింది. పైగా అక్కడ నిర్మాణాలు వాడుకుంటామని పేర్కొంటోంది. మరి అమరావతికి అన్యాయం అంటూ జనసేన చెప్పడంలో అర్ధం ఉందా అన్న విమర్శలు వస్తున్నాయి. అమరావతికి న్యాయం చేస్తూనే విశాఖ సీమలకు కూడా న్యాయం చేయాలని జనసేన కోరి ఉంటే బాగుంటుంది అన్న మాట వినిపిస్తోంది.
మరి విశాఖ లో రాజధాని వద్దు అని స్థానిక జనసైనికులు అనుకుంటున్నారా. విశాఖ ఊసే లేకుండా అమరావతి రైతులు, న్యాయం అంటూ జనసేన చెప్పాలనుకుంటోంది అంటే ఇక ఉత్తరాంధ్రా అన్యాయం పైన ఆ పార్టీ మాట్లాడదా మరి అన్న ప్రశ్నలు వస్తున్నాయి.