ఈషా రెబ్బా…అచ్చమైన తెలుగు హీరోయిన్. చిరంజీవి కోరి మరీ మాస్క్‌పై తీసిన వెబ్‌సిరీస్‌లో అవకాశం కల్పించారు. చిత్ర పరిశ్రమతో పాటు కరోనాపై ఆమె తన మనసులో మాట నిర్మొహమాటంగా చెప్పారు.
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెగాస్టార్ చిరంజీవి షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారని తనను సంప్రదించారన్నారు. ‘వేర్ ఎ మాస్క్’ కాన్సెప్ట్ చిరంజీవిదే అని చెప్పారన్నారు. మాస్క్ ధరించడాన్ని చాలా మంది సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి చెబితే వినేవాళ్లు చాలా మందే ఉన్నారని, అలా విన్నవాళ్లు కూడా లేకపోలేదన్నారు.
ఈ నేపథ్యంలో ‘వేర్ మాస్క్… స్టే సేఫ్’ ఫిల్మ్‌కి మంచి స్పందన వస్తున్నట్టు ఈషా తెలిపారు. చిరంజీవి చేసిన ఈ ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తున్నట్టు తనకు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వస్తున్నాయన్నారు.
మరీ ముఖ్యంగా తనకు సంతోషాన్ని ఇచ్చిన విషయాన్ని ఆమె తెలిపారు. ‘మన తెలుగు కథానాయిక, తెలుగమ్మాయి అయితే బావుంటుంది’ అని చెప్పి మాస్క్ ధరించడంపై చైతన్య పరిచే చిత్రంలో నటించడానికి తన పేరు స్వయంగా చిరంజీవే సూచించారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ఇళ్లలో నుంచి బయటికి వచ్చే అవకాశం లేకపోవడంతో ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ పూర్తి చేసినట్టు ఈషా వివరించారు.
కరోనా బారి నుంచి తమను తాము రక్షించుకోవాలంటే ఒకటే మార్గమని….అది మాస్క్ ధరించడమే అన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించడంతో పాటు చేతులు శానిటైజ్ చేసుకోవాలన్నారు. అలాగే భౌతిక దూరం పాటిస్తే కరోనాను కొంత మేరకైనా కట్టడి చేయవచ్చన్నారు.
ప్రస్తుతం కొత్త కథలు వింటున్నట్టు ఈషా వెల్లడించారు. వర్చ్యువల్ నెరేషన్ ఇస్తున్నారని, కొన్ని కథలు నచ్చి ఓకే చెప్పానన్నారు. ఇక తమిళంలో జీవీ ప్రకాశ్‌కుమార్ సరసన నటించిన ‘ఆయిరమ్ జన్మంగళ్’ వేసవిలో విడుదల కావాల్సి ఉండిందన్నారు. కరోనా వల్ల విడుదల కాలేదని ఆమె చెప్పుకొచ్చారు.
బాలీవుడ్‌లో నెపోటిజంపై రచ్చ సాగుతున్న నేపథ్యంలో ఈషా కూడా స్పందించారు. చిత్రపరిశ్రమలో బంధుప్రీతి ఉందని ఆమె నిర్మొహమాటంగా చెప్పారు. అయితే కేవలం బ్యాగ్రౌండ్ మాత్రమే సక్సెస్ తీసుకురాదన్నారు. టాలెంట్ మాత్రమే గీటు రాయి అని ఆమె తెలిపారు. ప్రతిభ లేకపోతే ప్రయోజనం ఉండదని ఆమె తేల్చి చెప్పారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకు తక్కువ అవకాశాలు వస్తాయన్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.