సినిమా టికెట్ ల కథ ఇక కోర్టుకే..?

వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్బంగా మంత్రి పేర్ని నాని చేసిన హడావుడి ఫలితంగా ఆంధ్రలో సినిమా టికెట్ ల జీవో పుట్టుకువచ్చింది. జమానా కాలం నాటి రేట్లతో కొత్త జివో ఇచ్చారు. ఇది…

వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్బంగా మంత్రి పేర్ని నాని చేసిన హడావుడి ఫలితంగా ఆంధ్రలో సినిమా టికెట్ ల జీవో పుట్టుకువచ్చింది. జమానా కాలం నాటి రేట్లతో కొత్త జివో ఇచ్చారు. ఇది చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురయింది. ఈ రేట్లతో ఎలా సినిమాలు విడుదల చేయాలా? అని కిందా మీదా అయింది. 

అయినా ప్రభుత్వంతో పోరు మంచిది కాదు కనుక మౌనం వహించింది. ఏ మంత్రి అయితే ఈ వ్యవహారం మొత్తానికి కారణమయ్యారో ఆ మంత్రినే మంచి చేసుకుని ముందుకు సాగింది. రకరకాల మార్గాల నుంచి సిఎమ్ ను మంచి చేసుకునే ప్రయత్నాలు సాగాయి. కోర్టుకు వెళ్తే ఇట్టే స్టే వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లకూడదని సహనంతో సాగారు.

అయినా ప్రభుత్వం కనికరించలేదు. ఆన్ లైన్ టికెటింగ్ చేస్తాం అంటే సరే అన్నారు. కనీసం కొత్త రేట్ల మీద కనీసం తలా పదిరూపాయలు పెంచినా చాలు అన్నారు. ముందుగా కొత్త రేట్లు ఇచ్చి ఆ పై ఆన్ లైన్  చేసుకోవచ్చు అని ఎంత చెప్పినా ప్రభుత్వం దగ్గర పని జరగలేదు. సరే ఆన్ లైన్ వ్యవహారం అయినా సింపుల్ గా తేలిపోతుంది కనుక బుక్ మై షో లాంటి యాప్ తో టై అప్ పెట్టుకోమని సలహాలు ఇచ్చినా జగన్ చుట్టూ వున్న జనాలు పడనీయలేదు. 

దాంతో ఆఖరికి ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం సవరణకు ఉపక్రమించింది. ఇప్పుడు టాలీవుడ్ కు క్లారిటీ వచ్చేసింది. ప్రభుత్వం టికెట్ రేట్లు ఇప్పట్లో ఇవ్వదు అని. అందుకే ఇక కోర్టు మెట్లు ఎక్కడ తప్ప మరో దారి లేదు అని డిసైడ్ అయిపోతున్నారని తెలుస్తోంది. డిసెంబర్ నుంచి వరుసగా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపు వ్యవహారాలకు పాల్పడుతోందని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల ముందు రోజు రాత్రి టికెట్ రేట్లు తగ్గిస్తూ జీవో ఇచ్చిన సంగతి ససాక్ష్యంగా కోర్టులో పెట్టడం ఓ ఆలోచనగా వుంది. అలాగే అసలు సినిమాటోగ్రఫీ చట్టం సవరణ సరికాదనే వాదనతో స్టే తెచ్చుకోవాలనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. 

ఇప్పుడు ఏ విధంగా స్టే వచ్చినా ఇక అక్కడితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడిపోయినట్లే. ఆ తరువాత పెద్ద సినిమాల టైమ్ లో పాత పద్దతిలో రేట్ల కోసం కోర్టుకు వెళ్లి తెచ్చుకోవడమే. మొత్తానికి సిఎమ్ జగన్ చుట్టూ వున్న జనాల కారణంగా వ్యవహారం తప్పుదారి పట్టేసింది. ప్రజలకు తక్కువ ధరల్లో వినోదం అందించాలన్న జగన్ ఆలోచనకు పురిట్లోనే సంధి కొట్టేసినట్లే.