సినిమా వివాదాల సెటిల్ మెంట్లు

హీరోలు, హీరోయిన్లు సినిమాలు ఒప్పుకోవడం, ఒక్కోసారి అవి ముందుకు నడవక పోవడం, దానికి రకరకాల కారణాలు వుండడం జరుగుతూ వుంటుంది. ఈ కారణాల్లో ఇటు నిర్మాతల వాదన వుంటుంది..అటు హీరో, హీరోయిన్ల వాదన వుంటుంది.…

హీరోలు, హీరోయిన్లు సినిమాలు ఒప్పుకోవడం, ఒక్కోసారి అవి ముందుకు నడవక పోవడం, దానికి రకరకాల కారణాలు వుండడం జరుగుతూ వుంటుంది. ఈ కారణాల్లో ఇటు నిర్మాతల వాదన వుంటుంది..అటు హీరో, హీరోయిన్ల వాదన వుంటుంది. ఈ తుని తగువులు ఎప్పటికీ తేలవు. వీళ్లది తప్పు అని వాళ్లు, వాళ్లది తప్పు అని వీళ్లు అంటూ వుంటారు. ఇలాంటి కేసులు కొన్నింటిని నిర్మాతల కౌన్సిల్ టేకప్ చేసి, సెటిల్ చేసే ప్రయత్నం ప్రారంభించింది.

హీరో నాగశౌర్య, ఓ ఎన్నారై కొత్త నిర్మాతకు సంబంధించిన ప్రాజెక్ట్ మీద విచారణ జరిపారు కౌన్సిల్ పెద్దలు. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాత ఇప్పటికే పదమూడు కోట్లకు పైగా ఖర్చు చేసేసారు. అందువల్ల హీరో నాగశౌర్య ఎన్ని అభ్యంతరాలు వున్నా, తప్పనిసరిగా ఈ సినిమా చేసి తీరాల్సిందే అని, అలా చేయడం ఇష్టం లేకపోతే నిర్మాతకు ఆ డబ్బు మొత్తం ఇచ్చి, సినిమాను టేకోవర్ చేసుకోవాలని తీర్మానం చేసారు. అయితే నాగశౌర్య వర్గాలు మాత్రం ఈ తీర్మానం తమకు అంగీకారం కాదన, ఇది వన్ సైడ్ జడ్జ్ మెంట్ అనీ అంటున్నాయి.

అలాగే నటి అంజలి తరపున ఓ వివాదానికి సంబంధించి మేనేజర్ వస్తే, అలా కుదరదని, నేరుగా తనే రావాలని కౌన్సిల్ పెద్దలు ఆదేశించారు

కమెడియన్, నటుడు సునీల్ కు సంబంధించిన ఓ వివాదాన్ని కూడా ఇరుపక్షాలకు అంగీకార యోగ్యంగా సెటిల్ చేసారు.

హీరోయిన్ పాయల్ విషయంలో, తాను కౌన్సిల్ నిర్ణయాలకు కట్టుబడి వుంటానని అంగీకారం తెలుపుతూ లేఖ ఇవ్వడంతో, ఆ వివాదానికి ముగింపు పలికారు.

మొత్తం మీద ఇన్నాళ్లకు కౌన్సిల్ యాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది. కేవలం చిన్న హీరోలు, చిన్న నటుల విషయంలో మాత్రమే ఇలా పట్టుగా వుండడం కాకుండా, భారీ సినిమాలకు ఇష్టం వచ్చినట్లు గైర్ హాజర్ అవుతూ, పదుల కొద్దీ రోజులు షూటింగ్ ఎగ్గొట్టే హీరోల పట్ల కూడా కౌన్సిల్ స్పందిస్తే ఇంకా చాలా బాగుంటుంది.