‘’..అప్పులు విపరీతంగా చేసేశారు… ఏపీ గల్లా పెట్టే ఖాళీ అయింది. 500 కోట్లతో రుషికొండను తొలిచేసి.. ప్యాలెస్ కట్టేశారు. ఖజానాలో ఎంత డబ్బుందో తెలీదు. భారీగా అప్పులున్నాయి. లెక్కలన్నీ బయటకు తీయాలి. అలా అని నేను పారిపోవడానికి సిద్దంగా లేను. అధ్యయనం చేస్తాం.. ఏపీకి పూర్వ వైభవం తెస్తాం…’’ ఆంధ్ర సిఎమ్ చంద్రబాబు నాయుడు.
అప్పులు విపరీతంగా చేసారు అన్నది అబద్దం కాదు. పక్కా నిజం. జగన్ హయాంలో అప్పులు చేసే జనాలకు పప్పు కూడు తినిపించారన్నది వాస్తవం. పనిలో పనిగా ఓ అయిదు వందల కోట్లో విశాఖ రుషి కొండ మీద మహారాజ సౌధం నిర్మించారు. అయితే ఆ డబ్బులు ఎక్కడికీ పోలేదు. అక్కడే వున్నాయి. అమ్ముతాం అంటే ఏ స్టార్ హోటల్ కంపెనీ అయినా ఎగరేసుకుపోతుంది. అందువల్ల ఆ సంగతి అలా వుంచితే అప్పుల లెక్కలు తీర్చడం కీలకం.
ఏ లెక్క అయినా ఓపెనింగ్ బ్యాలన్స్.. క్లోజింగ్ బ్యాలన్స్ అనే కాలమ్స్ తోనే మొదలవుతుంది.
అందువల్ల 2019 నాటికి వున్న అప్పులు ఎన్ని?
2019 నాటికి ఖజానాలో వున్న మొత్తం ఎంత?
2014 నుంచి 2019 వరకు చేసిన అప్పులు ఏ మేరకు?
అన్నది తేల్చాలి. ఆ తరువాత 2019 నుంచి 2024 లెక్కలకు రావాలి.
ఆపైన అసలు రాష్ట్ర ఆదాయం ఎంత?
జగన్ పథకాలకు కావాల్సింది ఎంత?
కూటమి హామీలకు కావాల్సింది ఎంత?
ఎంత అప్పు ఏటా చేయాల్సి వుంటుంది అన్న లెక్కలు కూడా కట్టాల్సి వుంటుంది. ఆంధ్రలోనే కాదు ప్రతి రాష్ట్రంలోనూ ఇదే సమస్య. ప్రభుత్వం మారినపుడల్లా, పాత ప్రభుత్వం అప్పులు చేసేసింది. ఖజానా ఖాళీ చేసేసింది అంటూ.
అంతెందుకు? 2019లో కూడా ప్రభుత్వం మారినపుడు, ఎన్ని వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్లారు. అన్న లెక్కలు కూడా అప్పట్లో జగన్ అండ్ కో చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఈ మాటలు వింటూ వుంటే, తెలంగాణలో మాదిరిగానే ఇప్పట్లో ఆంధ్రలో కూడా ఆరు హామీల అమలు అనేది జరుగుతుందా? అనే అనుమానం కలుగుతోంది.
జగన్ హామీలైనా, ఆరు హామీలైనా… ఎప్పుడైనా..ఎ న్నాళ్లైనా.. అప్పులతో నెట్టుకురావాల్సిందేనేమో?