గర్భం దాల్చిన తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చింది దీపికా పదుకోన్. కల్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం నల్లటి గౌన్ ధరించి, బేబీ బంప్ తో ఫంక్షన్ కు వచ్చిన దీపిక, అందర్నీ ఇట్టే ఆకర్షించింది. ఆమె ఫొటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఆమెపై చిన్నపాటి ట్రోలింగ్ మొదలైంది.
గర్భంతో ఉన్న దీపిక హై-హీల్స్ ధరించింది. పైగా అది మామూలు హీల్స్ కాదు. వాటిని పెన్సిల్-హీల్స్ అంటారు. మామూలుగానే ఇలాంటి హీల్స్ పై నడవడం కష్టం. అలాంటిది గర్భంతో అంటే చాలా రిస్క్. ఏమాత్రం పట్టుతప్పినా కాలుజారి కింద పడతాం.
గర్భంతో ఉన్నప్పుడు ఇలాంటి హీల్స్ ధరించడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఫ్యాషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని, ఒకవేళ నిజంగా ఫ్యాషనబుల్ గా కనిపించాలనుకుంటే, రిస్క్ లేని యాక్ససిరీస్ ధరించాలని సూచిస్తున్నారు. ఇలాంటి హీల్స్ వాడడం దీపికకు కొత్త కాకపోయినా, ప్రెగ్నెన్సీ టైమ్ లో కాస్త దూరంగా ఉంటే మంచిదంటున్నారు.
మరోవైపు ఆమె ధరించిన డైమండ్ బ్రాస్ లెట్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ వజ్రాల బ్రాస్ లెట్ ధర అక్షరాలా కోటి 16 లక్షల రూపాయలు. సెప్టెంబర్ లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ గ్యాప్ లో కొన్ని రోజుల పాటు భర్తతో ప్రశాంతంగా గడిపేందుకు లండన్ వెళ్లింది.