కమ్ బ్యాక్.. శ్రీను వైట్ల.. కమ్ బ్యాక్!

1999 నుంచి 2024. పాతికేళ్ల ప్రస్ధానం..దర్శకుడు శ్రీను వైట్లది. ఫీల్ గుడ్ చిన్న సినిమాలతో మొదలు పెట్టి, తెలుగు కమర్షియల్ సినిమాకు తనదైన ఫార్ములాను కనిపెట్టి, బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి,  తననే ఎంతో…

1999 నుంచి 2024. పాతికేళ్ల ప్రస్ధానం..దర్శకుడు శ్రీను వైట్లది. ఫీల్ గుడ్ చిన్న సినిమాలతో మొదలు పెట్టి, తెలుగు కమర్షియల్ సినిమాకు తనదైన ఫార్ములాను కనిపెట్టి, బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి,  తననే ఎంతో మంది ఫాలో.. ఫాలో.. అనేలా చేసి కూడా, తను ఫాలో ఆన్ లో పడిపోయారు. 

ఒక్క ఫ్లాప్ కెరీర్ ను నిర్ణయింస్తుంది టాలీవుడ్ లో. అలా వచ్చిన పెద్ద ఫ్లాప్ కాస్తా, అంతకు ముందు ఇచ్చిన మంచి సూపర్ హిట్ లను కనిపించకుండా మింగేసింది. కానీ ఎప్పడూ చీకటే వుండదు.. వెలుతురులోకి పయనించగలిగితే వెలుగూ చూడొచ్చు. ఇప్పుడు శ్రీను వైట్ల అదే ప్రయత్నంలో వున్నారు. గోపీచంద్ తో ఓ సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా దాదాపు విదేశాల్లోనే పూర్తిగా షూటింగ్ జరుపుకుంటుంది.

నీ కోసం సినిమాతో మొదలుపెట్టిన జర్నీ..అలా నెమ్మదిగా సాగుతూ వెంకీ తో టర్నింగ్ ఇచ్చుకుంది. ఢీ సినిమా మరింత మలుపుతిప్పింది. దుబాయ్ శ్రీను, రెడీ కూడా ధీమాను పెంచాయి. దూకుడు సినిమా శ్రీను వైట్లను ఓ రేంజ్ కు తీసుకెళ్లిపోయింది. బాద్ షా సినిమా ఇప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకునే సినిమాల్లో ఓకటి. 

కానీ ఆ తరువాతే తప్పు జరిగిపోయింది. ఆగడు సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. అప్పటి వరకు శ్రీను వైట్లకు ఫ్లాపులు లేవు అని కాదు. యావరేజ్ సినిమాలు అని కనీసం అనిపించుకున్న ఫ్లాపులు వున్నాయి. నిజానికి ఆగడు కూడా యావరేజ్ సినిమానే. ఇప్పటికీ అందులోని సీన్లు యూ ట్యూబ్ లో చూస్తుంటే భలేగా వుంటాయి. అప్పుడు వస్తుంది… ఆగడు సినిమా ఎక్కడ తేడా కొట్టి వుంటుంది అనే అంత సులువుగా కచ్చితమైన జవాబు దొరకని ప్రశ్న.

నిజానికి ఆ తప్పును బ్రూస్లీతో సరిచేసుకుని వుండొచ్చు. కానీ శ్రీను వైట్ల శక్తి సరిపోలేదు. కామెడీ ఓకె కానీ కంటెంట్ దగ్గర సమస్య అయింది. ఆ తరువాత మిస్టర్ కు మిస్ ఫైర్ అయింది. అమర్ అక్బర్ ఆంధోని.. ఫాలో.. ఫాలో అంది. దాంతో శ్రీనువైట్ల కెరీర్ కు పాజ్ బటన్ పడిపోయింది. కానీ శ్రీను వైట్ల ఎప్పటికీ మంచి దర్శకుడే. ఎంటర్ టైన్ మెంట్ టేస్ట్ వుంది. మ్యూజిక్ సెన్స్ వుంది. కానీ సరైన స్క్రిప్ట్ పడాలి. స్క్రిప్ట్ తో పాటు స్క్రీన్ ప్లే కుదరాలి.

ఈ రెండు విషయాల్లో శ్రీను వైట్ల జాగ్రత్తగా వుంటే కమ్ బ్యాక్ అన్నది కష్టమైన విషయం కాదు. శ్రీను వైట్ల గతంలో చేసిన తప్పులు ఈ సారి చేయకుండా విజయం దిశగా సాగిపోతారని ఆశిస్తూ…

పుట్టిన రోజు శుభాకాంక్షలు.