లోకేషేమో ఢిల్లీలో కూర్చున్నారు, ఏపీకి వస్తే ఆయనకు అరెస్టు భయమట! తనను చూసి జగన్ భయపడుతున్నాడని చెప్పుకున్న లోకేషులో ఇప్పుడు ఆ భయం కనిపిస్తోంది! మరి తండ్రి జైల్లో ఉంటే.. తనయుడు వెళ్లి ఢిల్లీలో కూర్చుకోవడం చోద్యానికి మించిన చోద్యం!
ఈ సమయంలో లోకేష్ కుటుంబానికి అండగా నిలవాలి, మరో వైపు పార్టీకి అండగా నిలవాలి! అంతే కాదు.. జనసేనతో సమన్వయం విషయంలో కూడా లోకేష్ దే బాధ్యత అనుకోవాలి! రాజకీయ వారసత్వం అంటే.. అది ఎమ్మెల్సీ పదవిని పొంది, మంత్రి అయిపోయినంత ఈజీ కాదని ఈ పాటికి లోకేష్ కు అర్థం అయి ఉంటుంది.
చంద్రబాబు సొంత పుత్రుడు లోకేషేమో ఢిల్లీకి పరిమితం అయ్యాడు. ఇక దత్తపుత్రుడి ఆచూకీ కూడా కనిపిస్తున్నట్టుగా లేదు. టీడీపీ-జనసేన సమన్వయ సమావేశం అంటూ ఒకటి జరిగితే.. దాంట్లో కనిపించాల్సిన లోకేష్, పవన్ ఇద్దరూ లేకుండానే అది జరిగింది.
ఆ సమావేశానికి టీడీపీ తరఫున నారా బ్రహ్మణి హాజరయ్యారట. ఆమె పవన్ కల్యాణ్ ఎక్కడ అని అడిగారట. అయితే పవన్ కు అంత తీరిక ఉందనుకుని ఆమె అనుకోవడం ఆమె పొరపాటు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఒకటీ రెండు రోజులు హడావుడి చేసిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత తన సినిమా షూటింగులతో తను బిజీగా ఉన్నట్టున్నాడు.
ఇక బాలకృష్ణ సంగతి సరేసరి! ఆయన వల్ల లాభం కన్నా.. నష్టం ఎక్కువనే విషయం అసెంబ్లీ పరిణామాలతో స్పష్టం అయ్యింది. అయితే సమన్వయ కమిటీ భేటిలో బాలకృష్ణ తలదూర్చినట్టుగా లేరు! చంద్రబాబు నాయుడు జైలు పాలై రెండో వారం గడుస్తున్న తర్వాత.. ఇదీ తెలుగుదేశం, జనసేనల పరిస్థితి! జాయింటుగా చిన్న పాటీ ర్యాలీని కూడా నిర్వహించలేనంత అసమర్థత బయటపడుతోంది. మరి చంద్రబాబు వివిధ కేసుల్లో భాగంగా మరి కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తే.. ఈ పరిస్థితి అప్పటికి ఎంత విషమిస్తుందో!
పవన్ కు సినిమా కమిట్ మెంట్స్ గట్టిగా ఉన్నాయి. ఒకవేళ సినిమా షూటింగులను అర్ధాంతరంగా ఆపేసినా.. వారం పది రోజులకు మించి పవన్ జనాల మధ్యన కానీ, కార్యకర్తల మధ్యన కానీ గడిపేంత సీన్లేమీ ఉండవు. అలాగే జనసేన కుర్రకారు అంటే తెలుగుదేశం వాళ్లకు ఎలాగూ చిన్నచూపు ఉండనే ఉంటుంది. వీళ్లను వాళ్లు ఎలా ట్రీట్ చేస్తారో కూడా వివరించనక్కర్లేదు.
లోకేష్ కు ఈ అసలు పొత్తు వ్యవహారమే ఆసక్తి లేనట్టుగా ఉంది. మరి రేపు వీధిన పడినప్పుడు, ఆ రచ్చ మామూలుగా అయితే ఉండదు!