కంపెనీలకు కొత్త రూటు

ఇండియాలో నిన్న మొన్నటి వరకు చాలా అంటే చాలా కంపెనీలు బ్యాంకుల మీద పడి బతికేసాయి. వేల కోట్ల రుణాలు తీసుకోవడం, ఎగ్గొట్టేయడం. ప్రభుత్వంలో వున్న పలుకుబడితొ మాఫీ చేయించుకోవడం. ఇలా చాలా కాలం…

ఇండియాలో నిన్న మొన్నటి వరకు చాలా అంటే చాలా కంపెనీలు బ్యాంకుల మీద పడి బతికేసాయి. వేల కోట్ల రుణాలు తీసుకోవడం, ఎగ్గొట్టేయడం. ప్రభుత్వంలో వున్న పలుకుబడితొ మాఫీ చేయించుకోవడం. ఇలా చాలా కాలం కొనసాగింది. అంటే పరోక్షంగా జనం డబ్బులు చాలా మందిని పెద్దవాళ్లను చేసింది. పలుకుబడి, తెలివితేటలు, రాజకీయం పెట్టుబడిగా ఎదిగిన వారు ఎందరో? ఒక్కప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్లు ఈ రోజు వేల కోట్లకు ఎదిగడం వెనుక ఇలాంటి వైనాలు చాలా మందికి వున్నాయి. 

అయితే మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ బ్యాంకుల ద్వారా దోపిడీ అనే దానికి తెరపడింది. గట్టిగా రుణాలు వసూలు అన్నది, బకాయిలపై నిలదీయడం అన్నది పెరిగింది. అప్పుడు తెలిసింది చాలా కంపెనీల డొల్లతనం. సంస్థలను బలిచేసి, యజమానులు సులువుగా తప్పించుకున్నారు. కోర్టులను అడ్డం పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఉత్తరాదిన అంబానీ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది వరకు ఇదే తంతు. మోడీ ప్రభుత్వం బ్యాంకుల విషయంలో తీసుకున్న అనేక చర్యల వలన ఈ తరహా కంపెనీలు అన్నీ గడ్డుకాలం ఎదుర్కొన్నాయి. మూతపడి అసలు రంగు తేలింది. 

ఇప్పటి వరకు బాగానే వుంది. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ వ్యవహారాలకు తెర లేచినట్లు కనిపిస్తోంది. ఏదైనా ఫ్యాక్టరీ, లేదా ఏదైనా ప్రొడక్టివ్ కంపెనీలు స్టాక్ మార్కెట్ కు వెళ్లడం వేరు. అసలు ఏమీ లేకుండా లాభాలు ఆర్జిస్టున్నట్లు చూపిస్తున్న అనేక కంపెనీలు ఇప్పుడు మార్కెట్ బాట పట్టి కోట్లకు కోట్లు జనాల నుంచి లాగేస్తున్నాయి. జనాలు ఈ మాయాజాలంలో చిక్కుకుంటున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో? ఈ బుడగ ఎప్పుడు పేలుతుందో మరి?

కేవలం తమ దగ్గర సిబ్బందిని మాత్రం పెట్టుకుని, ఒక్క రెస్టారెంట్ లేకుండా ఫుడ్ డెలివరీ చేస్తున్న కంపెనీ వేల కోట్లు షేర్ మార్కెట్ నుంచి సమీకరించింది. కాల్ సెంటర్ నిర్వహణ, కొద్ది మంది సిబ్బంది జీతాలు, పబ్లిసిటీ తప్ప మరో ఖర్చు లేదు. డెలివరీ ఖర్చులు జనాలవే. మరి ఇన్ని వేల కోట్ల సమీకరణ దేనికో తెలియదు.

లేటెస్ట్ గా అమెజాన్ మాదిరిగా కాస్మొటిక్ సామాగ్రిని ఆన్ లైన్ విక్రయించే సంస్థ వేల కోట్ల స్టాక్ మార్కెట్ మీదుగా సమీకరించింది. ఓ జాతీయ మీడియా సంస్థ ఏటా ఆర్జించే లాభం కోటి కోటిన్నర మించదు. కానీ వేల కోట్లు మార్కెట్ నుంచి సమీకరణ. కేవలం కాల్ సెంటర్ పెట్టి ఇంటికి ఫుడ్ సప్లయ్ చేయడం, కార్లు సప్లయ్ చేయడం వంటి పనులు చేసే సంస్థలు కూడా వేల కోట్లు మార్కెట్ నుంచి సమీకరించేసాయి.

కేవలం కాల్ సెంటర్ నిర్వహణ, ప్రచారం తప్ప మరే ఖర్చులేని ఈ సంస్థలు వేల కోట్లు సమీకరించడానికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తున్నట్లు? రేపు ఈ కంపెనీల లాభాలు మెలమెల్లగా తగ్గిపోతే షేర్ వాల్యూ పడిపోతుంది. జనాల డబ్బులన్నీ ఆవిరి అయిపోతాయి. 

గతంలో ఓ మీడియా సంస్థ ప్యాకింగ్ ఇండస్ట్రీ పెట్టి 1980 దశకంలో 400 కోట్లు సమీకరించింది. ఇవ్వాళ ఆ కంపెనీ లేదు. జనం పెట్టిన 400 కోట్లు ఏమయినట్లు? ఓ సినిమా నటుడు గతంలో గ్రానైట్ కంపెనీ పెట్టి జనం నుంచి కోట్లకు కోట్లు సమీకరించారు. ఇప్పుడు ఆ కంపెనీ లేదు. ఆ కోట్లు ఏమయినట్లు?

షేర్ మార్కెట్ రిస్క్ అని తెలిసి పెట్టుబడి పెట్టినపుడు నష్టం భరించాల్సిందే అని చెప్పడం కామన్. కానీ అసలు కంపెనీల స్థితి గతులు, వాటికి ఎంత పెట్టుబడి కావాలి. ఎంత నిర్వహణ వ్యయం కావాలి అన్నది చూడకుండా కోట్లకు కోట్లు మార్కెట్ నుంచి సమీకరించడానికి అనుమతి ఇవ్వడం ఏమిటి అన్నది కూడా చూడాలి కదా? 

ఇప్పుడు అంతా బాగానే వుంటుంది. మరో అయిదేళ్లకో, పదేళ్లకో ఒక్కో బాగోతం బయటకు వస్తుంది. పెట్టుబఢి పెట్టన వారంతా అప్పుడు సైలంట్ గా బాధపడతారేమో?