మొన్నటికి మొన్న హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్, అతడి భార్య రీటా విల్సన్ కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు మరో హాలీవుడ్ బ్యూటీకి కరోనా సోకింది. ఆమె పేరు ఓల్గా కుర్లెంకో. తనకు కరోనా సోకిన విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
“కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన తర్వాత పూర్తిగా ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్నాను. దాదాపు వారం రోజులుగా అనారోగ్యంగా ఉన్నాను. జ్వరం, నొప్పులు నా లక్షణాలు. దయచేసి కరోనాను సీరియస్ గా తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి.”
ఇలా ఇనస్టాగ్రామ్ లో తనకు కరోనా సోకిన విషయాన్ని బయటపెట్టింది ఓల్గా. 2008లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమా క్వాంటమ్ ఆఫ్ సొలేస్ తో బాండ్ గర్ల్ గా పాపులర్ అయింది ఓల్గా. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె ఎంపైర్స్ ఆఫ్ ది డీప్, ది బే ఆఫ్ సైలెన్స్ అనే సినిమాలు చేస్తోంది. ఓల్గా కరోనా బారిన పడ్డంతో ఈ రెండు సినిమాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది.
హాలీవుడ్ ను కరోనా గట్టిగానే తాకింది. ఇప్పటికే అమెరికాలోని థియేటర్లలో సీటింగ్ కెపాసిటీ తగ్గించేశారు. లిమిటెడ్ గా టిక్కెట్లు ఇస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మల్టీప్లెక్సులు మూసేశారు. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ తో పాపులరైన జానీ డెప్, స్వీయనియంత్రణలో భాగంగా తన షూటింగ్స్ అన్నీ కాన్సిల్ చేసుకున్నాడు.