ప్రముఖ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు కవిత కుమారుడిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. కరోనా సెకెండ్ వేవ్ భారీగా ప్రాణాలు తీస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నాపెద్దా, పేదధనిక, సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా మహమ్మారి పంజా విసురుతోంది.
సినీ పరిశ్రమలో అనేక మంది కరోనా బాధితులుగా మిగిలారు, మిగులుతున్నారు. ఒకవైపు కరోనా సెకెండ్ వేవ్ తగ్గుతున్నా…మరణాలు మాత్రం కొనసాగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా సీనియర్ నటి కవిత ఇంట్లో మహమ్మారి తీవ్ర విషాదం నింపింది. కరోనా బారిన పడ్డ కవిత కుమారుడు సంజయ్ రూప్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచాడు. కవిత భర్త దశరథ రాజ్ కూడా ఆ మహమ్మారి బారిన పడి ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నాడు. ఆయన పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా కవిత 11 ఏళ్ల వయసులోనే తెరంగేట్రం చేశారు. టాలీవుడ్‌లో కె. విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరి సిరి సినిమా ద్వారా పరిచయం అయ్యారు. 1990లో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా కవిత గుర్తింపు పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది భాషలన్నింటి చిత్రాల్లో కవిత నటించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు.
ఆ తర్వాత టీడీపీలో చేరారు. చాలా కాలం పాటు ఆ పార్టీకి సేవలందించారు. కానీ సరైన గుర్తింపు లేకపోవడంతో అవమానకర రీతిలో ఆ పార్టీ నుంచి బయటికొచ్చారు. అనంతరం బీజేపీలో చేరారు. రాజకీయాల్లో మునుపటిలా యాక్టీవ్‌గా లేరామె.