అదేం సమస్యనో కానీ 2023లో సినిమాల విడుదల ఏదీ పక్కా ప్లానింగ్ ప్రకారం జరగలేదు. జనవరి నుంచి ఇదే తీరు. సమ్మర్ సీజన్ అయితే చాలా వృధాగా పోయింది. వినాయకచవతి డేట్ కు సరైన సినిమానే లేదు. దసరాకు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు వచ్చేస్తున్నాయి.
ఇటు కీలకమైన రెండు తెలుగు సినిమాలు, ఓ పెద్ద తమిళ సినిమా లియో, మరో పెద్ద హిందీ సినిమా గణపతి ఒకేసారి వస్తున్నాయి. ఆ తరువాత నుంచి మళ్లీ నెలన్నర వరకు సరైన సినిమాలు లేవు. ఎవరూ కూడా ఆఫ్ సీజన్ అయిన నవంబర్ లో వచ్చే ధైర్యం చేయడం లేదు.
డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మళ్లీ కుమ్మేసుకోవడమే. యనిమల్ సినిమా డిసెంబర్ ఫస్ట్ న వస్తుంటే, నాని, నితిన్ ల సినిమాలు ఫస్ట్ వీక్ లో వస్తున్నాయి. సలార్ 22న విడుదల కనుక ముందు వారం, వెనుక వారం గ్యాప్ ఇచ్చేసారు. మొత్తం మీద చూసుకుంటే డిసెంబర్ లో నాలుగు పెద్ద సినిమాలు వచ్చేలా వున్నాయి.
జనవరి కి ఇంక చెప్పనక్కరలేదు. ఇప్పటి వరకు మూడు నాలుగు సినిమాలు ఫిక్స్ అయ్యాయి. అన్నీ పెద్ద సినిమాలే. ఆ తరువాత పరస్థితి చూస్తుంటే మిడ్ రేంజ్ సినిమాల జోరు తగ్గేలా వుంది. ఎందుకంటే శాటిలైట్, డిజిటల్ అమ్మకాలు రాను రాను తగ్గుతున్నాయి. ఓ రేంజ్ సినిమాలను తీయడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది.