జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు భలే చిత్రమైన నాయకుడు. జనసేనలో అసలేం జరుగుతున్నదో ఆయనే అమాయకంగా బయట పెట్టేస్తుంటారు. అమరావతిలో జనసేన కార్యకర్తల సమావేశంలో నాగబాబు హెచ్చరికలపై లోతుగా పరిశీలిస్తే… టీడీపీతో పొత్తును సొంత పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారనే సంకేతాలు ఇచ్చారు. అందుకే నాగబాబు పదేపదే పవన్‌కల్యాణ్ తీసుకునే నిర్ణయాలను బలపరచాలని కోరడం.
పార్టీలోని ప్రతి కార్యకర్త, నాయకుడు జనసేన హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని కోరారు. అంతటితో ఆయన ఆగలేదు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించమని ప్రతిజ్ఞ చేయాలని కార్యకర్తలను ఆయన కోరడం గమనార్హం. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు, కార్యకర్తల విషయంలో గొడవ పడొద్దని, అలాగే వ్యతిరేకించొద్దని ఆదేశించారు. అలాగే పార్టీ ప్రతిష్టకు, సమగ్రతకు భంగం కలిగించేలా వారు ఏ స్థాయి వ్యక్తులైనా కఠిన చర్యలు తీసుకుంటామని నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జనసేన జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని నిర్ణయాలు పార్టీలోని కొంత మందికి తాత్కాలికంగా వ్యక్తిగత ఇబ్బందులకు గురి చేయవచ్చన్నారు. నాగబాబు తాజా కామెంట్స్‌పై చర్చ జరుగుతోంది. ఇటీవల జనసేన అనుకూల యూట్యూబర్ చంద్రబాబునాయుడిని విమర్శిస్తూ ఒక వీడియో చేశాడు. దాన్ని కౌంటర్ చేస్తూ టీడీపీ అధికార ప్రతినిధి కూడా వీడియో చేయడంతో వివాదం తలెత్తింది.
జనసేన యూట్యూబర్‌కు మద్దతుగా కొందరు కాపు యువత సోషల్ మీడియా వేదికగా టీడీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా టీడీపీ వ్యవహరిస్తే ఊరుకునేది లేదని జనసేన సానుభూతి కాపు యువత పెద్ద ఎత్తున వీడియోలు విడుదల చేసింది. ఇలా సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన సామాజిక కార్యకర్తలు, నేతల మధ్య చిన్నస్థాయి వార్ జరుగుతోంది. తన పార్టీ సానుభూతిపరులను హెచ్చరిస్తూ నాగబాబు కామెంట్స్ చేయడం ఆసక్తికర పరిణామం.
టీడీపీ పల్లకీ మోస్తున్న పవన్‌కల్యాణ్‌ను అభిమానిస్తున్న వారంతా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని మాటలు తిట్టినా పడి వుండాలని నాగబాబు పరోక్షంగా తన పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారనే చర్చకు తెరలేచింది. ఇలా ఆత్మాభిమానాన్ని చంపుకుని జనసేన కార్యకర్తలు, నాయకులు పవన్ వెంట ఎంత కాలం నడుస్తారో చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.