మ్యూజిక్ డైరక్టర్ గా ఓ వైపు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ హీరోగా మారాలనే ఆశ మాత్రం దేవిశ్రీకి ఇంకా పోలేదు. తను హీరోగా మారే అంశంపై మరోసారి రియాక్ట్ అయ్యాడు ఈ సంగీత దర్శకుడు. తనకు కూడా హీరోగా నటించాలని ఉందని కాకపోతే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం మ్యూజిక్ పైనే పెట్టానంటూ చెప్పిన డైలాగ్ నే మళ్లీ చెప్పాడు డీఎస్పీ.
“సినిమా చేయమని అడుగుతున్నారు గాని, నాకు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రస్ట్ వల్లనేమో యాక్టింగ్ చేయాలనే ఆసక్తి రావడం లేదు. అయితే నాకు తమిళంలో ఎక్కువమంది కథలు చెబుతున్నారు. సంగీతం ప్రధానంగా సాగే కొత్త కథ ఉంటే ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను.”
ఇలా తన డెబ్యూకు సంబంధించి మరో ట్విస్ట్ ఇచ్చాడు దేవిశ్రీ. కుదిరితే తమిళ్ లోనే హీరోగా నటిస్తాననే అర్థం వచ్చేలా మాట్లాడాడు. నిజానికి సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మించాలనేది దిల్ రాజు ఆలోచన. ఇది ఇప్పటిది కాదు. దాదాపు ఐదేళ్ల కిందటే ఈ ఆలోచన మొగ్గతొడిగింది. కానీ ప్రతిసారి వాయిదా పడుతూ వస్తోంది.
ఆమధ్య దీనిపై సుకుమార్ కూడా క్లారిటీ కూడా ఇచ్చాడు. అంతా బిజీగా ఉండడంతో ప్రాజెక్టు సెట్ అవ్వడం లేదన్నాడు. ఇప్పుడు దేవిశ్రీ కూడా అదే అంటున్నాడు. కెరీర్ పరంగా బిజీగా ఉన్నానని చెబుతున్నాడు. అంతేకాదు, కొత్త సంవత్సరంలో ఓ బాలీవుడ్ సినిమాకు కూడా కమిట్ అయ్యానని, దీంతో వర్క్ మరింత పెరిగిందని చెబుతున్నాడు ఈ సంగీత దర్శకుడు.