విశాఖ తమ్ముళ్ళతో రాజీనామాలు చేయిస్తారా…!?

మాట్లాడితే చాలు చంద్రబాబు మూడు రాజధానులపైన రెఫరెండం అంటున్నారు. ప్రజల అనుమతి లేకుండా రాజధానులను మార్చడం  తగదని సెలవు ఇస్తున్నారు. అమరావతి ఒక్కటే రాజధాని. అలా కాదనుకుంటే ప్రజల వద్దకు వెళ్ళి మళ్ళీ జగన్…

మాట్లాడితే చాలు చంద్రబాబు మూడు రాజధానులపైన రెఫరెండం అంటున్నారు. ప్రజల అనుమతి లేకుండా రాజధానులను మార్చడం  తగదని సెలవు ఇస్తున్నారు. అమరావతి ఒక్కటే రాజధాని. అలా కాదనుకుంటే ప్రజల వద్దకు వెళ్ళి మళ్ళీ జగన్ తీర్పు కోరాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.

మరి జగన్ కి ప్రజలు  151మంది  ఎమ్మెల్యేలు, 50 శాతానికి పైగా ఓట్ల షేరు ఇచ్చినది తీర్పు కాదా అని వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఏడు నెలల క్రితమే వచ్చిన ఆ తీర్పు ఇంకా పచ్చిగానే ఉందని, కాదంటే తమ్ముళ్ళ మాడు పగిలిన చోట ఇంకా తగ్గని నొప్పిని చూసుకోమంటోంది.

ఇంకా బాబుకు సరదా ఉంటే తన పార్టీ నుంచి గెలిచిన వారి చేత రాజీనామాలు చేయించుకోవచ్చునంటూ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సవాల్ చేశారు. ఎక్కడో కాదు, విశాఖలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు బాబూ, రెండు నెలల్లోనే ఎన్నికలు పెట్టిస్తాము, అపుడు గెలువు చూద్దామంటూ గట్టిగానే జవాబు చెబుతున్నారు.

విశాఖలో రాజధాని ఎవరూ కోరుకోలేదనడానికి అసలు బాబు ఎవరని ఆయన ఘాటుగానే ప్రశ్నించారు.  విశాఖ వాసులకు ఇన్నాళ్ళకు రాజధాని వస్తే అడ్డుకోవడానికి బాధ అనిపించడం లేదా బాబూ అంటూ ఆయన క్లాస్ తీసుకుంటున్నారు.

జోలే పట్టడం, విరాళాలు సేకరించడం బాబుకు అలవాటు అయిపోయిందని, అనాడు రాజధాని కోసం విరాళాలు సేకరించి ఏం చేసారో చెప్పాలని కూడా దాడి డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు రెఫరెండం అటు ఇటూ తిరిగి విశాఖ ఎమ్మెల్యే తమ్ముళ్ళ సీటు కిందకు నీళ్ళు తెచ్చేలా ఉందని అంటున్నారు.