జనసేనాని పవన్‌కల్యాణ్ తానొక అపరమేధావి అని తనకు తాను ఫీల్ అవుతుంటాడు. ఆలోచనతో కాకుండా ఆవేశంతో ఆయన తరచూ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ తర్వాత వెనక్కి చూసుకుని నష్టపోయామనే భావన, బాధతో, ఇక చేసేదేమీ లేక మౌనం పాటిస్తుంటాడు. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ఆయన ఇటు ముందుకెళ్లలేక, అటు వెనక్కి వెళ్లలేక త్‘త్రిశంకు స్వర్గం’లో ఉన్నాడు.
మంగళగిరిలో జనసేన కార్యాలయంలో శుక్రవారం పవన్‌ను తుళ్లూరు, మందడం, యర్రబాలెం, బేతపూడి, నిడమర్రు తదితర గ్రామాల రైతులు, మహిళలు కలిశారు. వారి గోడు విన్నాడు. ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ …‘కేంద్రం స్పందించేలా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై నిర్ణయం తీసుకోడానికి జనసేనకు కొంచెం సమయం ఇవ్వండి’ అని విన్నవించుకున్నాడు.
రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. రాజధాని విషయంలో తన వ్యవహార శైలి మిగిలిన ప్రాంత ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నదనే సమాచారం ఆయనకు వెళ్లినట్టు సమాచారం. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహారంగా రాజధాని ఆందోళన తయారైందనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే ప్రజల నుంచి ఏ మాత్రం మద్దతు లభించలేదు. అంతేకాదు సీపీఎం అంటీముట్టనట్టగా వ్యవహరిస్తుండడం కూడా పవన్‌లో ఓ ఆలోచన కలిగించినట్టు సన్నిహితుల ద్వారా సమాచారం.
చంద్రబాబు కలల రాజధాని కోసం తానెందుకు ఇతర ప్రాంతాల వారికి చెడ్డ కావాలనే అంతర్మథనం మొదలైనట్టు తెలిసింది. ‘ఈ రోజుకూ రాజధాని తరలిస్తున్నామని గెజిట్ గానీ, జీవో గానీ ఇవ్వలేదు’ అని పవన్ తప్పు పట్టాడు. మళ్లీ ఆయనే రాజధాని మార్పు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకున్న అశాంతిని తొలగించడానికి కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాడు. అది కేంద్రప్రభుత్వ ధర్మం…బాధ్యతని గుర్తు చేశాడు.
రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ గెజిట్, జీవో జారీ చేయలేదని ఒకవైపు చెబుతూ, మళ్లీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకో వాలని డిమాండ్ చేయడం ఏంటో?…కనీసం పవనకైనా అర్థమవుతోందా? అసలు పవన్ ఎక్కడ ట్రాక్ తప్పారంటే…రాజధాని రైతుల ఆందోళనపై ఎల్లో మీడియాలో వెల్లువెత్తిన ఉద్యమ కథనాలు, వీడియోలను చూసి ఏదో జరిగిపోతోందని పవన్ అభిప్రాయానికి వచ్చాడు.
దీంతో తానెక్కడ వెనకపడి పోతానో అని గుడ్డిగా రాజధానిలో దూకాడు. ఆ తర్వాత అసలు విషయం బోధపడి…ఓ పథకం ప్రకారం చంద్రబాబు, ఆయన తాలూకు మీడియా తనను రాజధానిలో దూకేలా చేసిందనే విషయాన్ని గ్రహించాడు. ఇప్పుడు ముందుకెళ్లలేక, వెనక్కి పోలేక…త్రిశంకు స్వర్గంలో ఇరుక్కున్నాడు. రాజకీయాల్లో ప్రతిదీ ఓ అనుభవం. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎల్లో మీడియా చేతిలో చావు దెబ్బతిన్న పవన్‌కు…జ్ఞానోదయం కావాలంటే ఇంకెన్ని గాయాలు కావాలో మరి?