మీరు మారిపోయారు సర్.. మీరు మారిపోయారు.. ఈ డైలాగు చాలా ఫేమస్. టెంపర్ సినిమాలో పోసాని డైలాగు అది. నిర్మాత దిల్ రాజును చూసి కొన్నాళ్ల తరువాత ఇలా అనాల్సి వస్తుందేమో? ఎందుకంటే సోషల్ మీడియా తీరు చూసి ఆయన కాస్త వైరాగ్యంలో వున్నారు.
ఇకపై ఎక్కువ మాట్లాడకూడదని, ఎక్కువగా హడావుడి చేయకూడదని అనుకుంటున్నారు. వీలయినంత వరకు తెరవెనుకే వుండాలని, సినిమాను సినిమానే ప్రమోట్ చేసుకుంటుందని ఆయన భావిస్తున్నారు.
ఫ్యామిలీ స్టార్ సినిమాకు నిర్మాత దిల్ రాజు తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నంతగా వ్యవహరించారు. ఆయనే ఇంటర్వూలు చేసేసారు. హీరో, హీరోయిన్ ల్లో ఎవరిని ప్రశ్నలు అడిగినా, దీనికి నేను సమాధానం చెబుతా అంటూ మైక్ అందేసుకోవడం, చెప్పడం చేసారు.
ఇక స్టేజ్ మీద డ్యాన్స్ లు, పాటలు మామూలే. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే అడగొచ్చు. డిజిటల్, వెబ్ మీడియా అయితే మీద మీదకు వెళ్లి నిలదీయవచ్చు. ఢాం.. ఢాం అంటూ బెదిరించవచ్చు. కానీ సోషల్ మీడియా తో చిక్కేమిటంటే ఎవరు.. ఎక్కడ.. ఎలా కాంట్రాక్ట్ అన్నది తెలియదు.
మరీ ఇబ్బంది అయితే సైబర్ క్రైమ్ కంప్లయింట్ ఇవ్వాలంతే. కాదీ వందల్లో, వేలల్లో వున్న హ్యాండిల్స్. ఎన్ని అని ఆపగలుగుతారు. దీనికి పరిష్కారం ఒక్కటే. మంచి సినిమా తీయడం. మంచి సినిమా అంటే ప్రేక్షకులు మెచ్చిందే మంచి సినిమా. కలెక్షన్లు వచ్చిందే మంచి సినిమా. అదే ట్రెండ్. అందుకే దిల్ రాజు ఇప్పుడు ఇక సినిమాను ఎంత వరకు ప్రమోట్ చేయాలో అంతే చేసి వదులుతారు. ఆపై సినిమా బాగుంటే దాన్ని అదే ప్రమోట్ చేసుకుంటుంది.
అందువల్ల ఇకపై క్వాలిటీ ఆఫ్ మేకింగ్ మీద దృష్టి పెట్టి, స్టేజ్ మీద హడావుడి తగ్గిస్తారట దిల్ రాజు.