వకీల్ సాబ్ సినిమా కోసం ఆఖరి నిమిషంలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. పేరుకు ఇది హీరోయిన్ పాత్ర అయినప్పటికీ, సినిమాలో ఆమెది గెస్ట్ రోల్ అన్నట్టు ఉంటుంది. ఎక్కడో ఫ్లాష్ బ్యాక్ లో శృతిహాసన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుందన్నమాట. దీనికి తోడు దిల్ రాజు తీసుకున్న ఓ నిర్ణయం.. శృతి స్క్రీన్ స్పేస్ ను ఇప్పుడు మరింత తగ్గించేసింది.
లాక్ డౌన్ వల్ల కాల్షీట్లన్నీ చెల్లాచెదురైన టైమ్ లో ఇటు శృతిహాసన్ ను, అటు పవన్ కల్యాణ్ ను సెట్ పైకి తీసుకురావడం దిల్ రాజుకు కష్టమైంది. అప్పటికే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న పవన్ వీలైనంత త్వరగా వకీల్ సాబ్ ను పూర్తిచేయమని.. దిల్ రాజుకు అల్టిమేటం జారీచేశాడు. దీంతో చేసేదేం లేక పవన్-శృతిహాసన్ కాంబోలో తీయాల్సిన ఓ సాంగ్ ను లేపేశాడట దిల్ రాజు.
అలా వకీల్ సాబ్ షూటింగ్, పాట లేకుండానే పూర్తయిందనిపించారు. దీంతో సినిమాలో శృతిహాసన్ కనిపించే నిడివి ఇంకా తగ్గిపోయింది. అంతేకాదు, ఆ మేరకు శృతిహాసన్ రెమ్యూనరేషన్ ను కూడా దిల్ రాజు తగ్గించినట్టు సమాచారం. దాదాపు 20 లక్షల రూపాయలు తగ్గించి, శృతిహాసన్ కు పారితోషికం సెటిల్ చేసినట్టు చెబుతున్నారు.
ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు వకీల్ సాబ్ టీజర్ రాబోతోంది. పవన్ కల్యాణ్ లాయర్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో అనన్య, అంజలి, నివేత థామస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.